Heavy Rains in AP : ఏపీపై మరోసారి ప్రతాపం చూపేందుకు వరుణుడు సిద్ధమవుతున్నాడు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాల కారణంగా గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు నెలల క్రితం భారీ వర్షాల కారణంగా ఏపీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలోనూ భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలతోపాటు.. రైతుల తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో రైతులకు భారీగా నష్టం వాటిల్లితుంది. తాజాగా మరోసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉండటం, ఏపీలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ప్రజలు హడలిపోతున్నారు.
ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో గత వారంరోజుల క్రితం వరకు ఫెంగాల్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల నుంచి తేరుకోక ముందే మళ్లీ బంగాళాఖాతంలో వాయుగండం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు హడలిపోతున్నారు.
వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ -వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువవుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 11, 12 తేదీల్లో తమిళనాడులో, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం వాయుగుండంగా మరే అవకాశం ఉందని, అల్పపీడనం ఏర్పడిన తరువాత దానిపై స్పష్టత వస్తుందని, ఒకవేళ అలప్పీడనం వాయుగుండంగా మారితే ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.