Vykuntam Prabhakar Chowdary : అనంతపురంలో టీడీపీకి షాక్? మాజీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం?

Vykuntam Prabhakar Chowdary

Vykuntam Prabhakar Chowdary : అనంతపురం టీడీపీలో అసమ్మతి రగులుతూనే ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. దగ్గుపాటి ప్రసాద్ కు సహకరించేదే లేదన్నారు. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేశానని అయినా టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాకర్ చౌదరి. టికెట్ ఇవ్వకపోవటం తనకు, కార్యకర్తలకు తీవ్ర మనస్తాపం కలిగించిందని తెలిపారు.

”పార్టీ మారే ఆలోచన నాకు లేదు. పార్టీ మారాలని అనుకుని ఉంటే ఎప్పుడో మారేవాడిని. నేను పని చేసింది టీడీపీలో. నాకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుదే. నేను ఎక్కడా తప్పు చేయలేదు. ఆస్తులు అమ్ముకుని కష్టాలు, నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నేను, నాతో పాటు చాలా మంది నాయకులు, కార్యకర్తలు పని చేశారు. తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన ఒకరు, ఇద్దరు వ్యక్తులు తప్ప.. మిగిలిన వాళ్లంతా కష్టాల్లో ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం.

టికెట్ విషయంలో పార్టీ హైకమాండ్ పునరాలోచన చేయాలని మేము అభ్యర్థిస్తున్నాం. కార్యకర్తలు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరితే అందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకు బంధువులు నా చుట్టూ ఉన్న నాయకులు, కార్యకర్తలే. కష్టాల్లో, నష్టాల్లో మన వెంట ఉన్నవాడే బంధువు, స్నేహితుడు. నాకు వేరే పార్టీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. రాజ్యసభతో పాటు చాలా పోస్టులు ఇస్తామన్నారు. నాకు పోస్టులు, పదవులు, పార్టీలు కాదు.. ఇక్కడ నా కార్యకర్తలను, నా కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వాళ్లందరికీ నా అవసరం ఉంది. పార్టీ కోసం చంద్రబాబు కోసం కష్టపడి పని చేశా. దగ్గుబాటి ప్రసాద్ కు సహకరించే ప్రసక్తే లేదు. ఏ రోజు కూడా ఆయన పార్టీ కోసం పని చేయలేదు. కార్యకర్తలకు అండగా నిలబడలేదు. అలాంటి వ్యక్తికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలి” అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు.

అనంతపురం అర్బన్ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆశించారు. కచ్చితంగా తనకే టికెట్ వస్తుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా అనంతపురం అర్బన్ లో కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. దీంతో ప్రభాకర్ చౌదరి, ఆయన అనుచరులు, వర్గీయులు షాక్ కి గురయ్యారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు, అభిమానులు నిరసనకు దిగారు. పార్టీ ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన తమను కాదని.. ఎవరో వ్యాపారులను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం ఏంటని ప్రభాకర్‌ చౌదరి, ఆయన అనుచరులు మండిపడుతున్నారు.

Also Read : నాని వర్సెస్ మోహిత్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో గెలుపెవరిది?

 

ట్రెండింగ్ వార్తలు