ఇకపై వారికి 2 లడ్డూలే..! తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన..

శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు టోకెన్ పై ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నాం. టోకెన్ కలిగిన భక్తులు అదనంగా లడ్డూలు కావాలంటే లభ్యతను బట్టి 4 నుండి 6 లడ్డూలు కొనుగోలు చేయొచ్చు.

Tirumala Laddu Prasadam (Photo Credit : Google)

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల దళారీలకు చెక్ చెప్పింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకోకుండా కేవలం లడ్డూలు మాత్రమే కొనుగోలు చేసే వారికి షాక్ ఇచ్చింది. శ్రీవారి దర్శనం చేసుకోకుండా లడ్డూలు కావాలంటే ఇకపై ఆధార్ కార్డు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక ఆధార్ పై కేవలం రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఒక ఆధార్ కార్డుకు రోజుకు ఒకసారి మాత్రమే లడ్డూలు ఇస్తామని తేల్చి చెప్పారు.

”శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు టోకెన్ పై ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నాం. టోకెన్ కలిగిన భక్తులు అదనంగా లడ్డూలు కావాలంటే లభ్యతను బట్టి 4 నుండి 6 లడ్డూలు కొనుగోలు చేయొచ్చు. కొంతమంది దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట అమ్ముకుంటున్నారు. అలాంటి దళారీలను కట్టడి చేయడానికే ఆధార్ తీసుకుని వారికి 2 లడ్డూలు మాత్రమే విక్రయిస్తున్నాం. నిజమైన శ్రీవారి భక్తుల కోసం టీటీడీ తీసుకున్న మంచి నిర్ణయం ఇది” అని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

Also Read : ముంబై నటికి వేధింపుల కేసు.. పోలీసులకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ఆదేశం

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలి వస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకుని పులకించిపోతారు. తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. ఇక శ్రీవారిని దర్శించుకుని ఎంత పులకించిపోతారో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వీకరించి అంతే గొప్ప అనుభూతికి లోనవుతారు. లడ్డూ ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ తిరుమల నుంచి వెనుదిరగడనే చెప్పాలి. లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు. భక్తులకున్న ఈ వీక్ నెస్ ను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. లడ్డూలను కొని అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యక్తులు దళారీ అవతారం ఎత్తారు. కౌంటర్లలో లడ్డూలను కొనుగోలు చేయడం, ఎక్కువ రేటుకు భక్తులకు విక్రయించడం చేస్తున్నారు. ఈ వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్లింది. దీంతో చర్యలు చేపట్టారు. ఇకపై దర్శనం చేసుకోకుండా లడ్డూలు కావాలంటే కచ్చితంగా ఆధార్ ఇవ్వాల్సిందేనని, ఆ వ్యక్తులకు రోజుకు రెండు లడ్డూలు మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ విధంగా దళారీలకు చెక్ చెప్పినట్లు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు