Botcha Satyanarayana: మరోసారి బొత్సకు అస్వస్థత.. మండలిలో మాట్లాడుతుండగా.. వెంటనే పరీక్షలు చేసిన డాక్టర్లు
విషయం తెలిసిన వెంటనే సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. బొత్స సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు.
Botcha Satyanarayana Representative Image (Image Credit To Original Source)
- బొత్సకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు
- బీపీలో హెచ్చు తగ్గుల కారణంగా అస్వస్థత
- నిలకడగా బొత్స ఆరోగ్యం.. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ల సూచన
Botcha Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలి సమావేశాలకు హాజరైన బొత్స.. మాట్లాడుతున్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలర్ట్ అయిన అసెంబ్లీ వర్గాలు.. అత్యవసరంగా డాక్టర్లను పిలిపించారు. డాక్టర్లు బొత్సకు ఆయన ఛాంబర్ లో వైద్య పరీక్షలు చేశారు. బొత్స హైబీపీతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
బీపీలో హెచ్చు తగ్గుల (190/120) కారణంగానే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. విశ్రాంతి తీసుకోవాలని బొత్సకు సూచించారు వైద్యులు. అటు బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే వైద్యులతో అసెంబ్లీలోని డాక్టర్లు మాట్లాడారు. బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వారికి తెలిపారు. బొత్స సత్యనారాయణ మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
అస్వస్థత గురించి విషయం తెలిసిన వెంటనే సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. బొత్స సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. బొత్స హై బీపీతో ఇబ్బంది పడుతున్నారని, బీపీ కంట్రోల్ లోకి రాకపోతే హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంటుందన్నారు.
బొత్స సత్యనారాయణ ఇటీవలే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్ తరలించారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో బొత్సకు చికిత్స అందించారు.
శాసన మండలి సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అంశం ఏదైనా.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల సభ్యులు వాదోప వాదనలకు దిగుతున్నారు.
Also Read: కర్ణాటక బాటలో ఏపీ.. చిన్నపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
