మాలీవుడ్‌ ఇండస్ట్రీలో పలువురు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రకంపనలు రేపుతోన్న కాస్టింగ్ కౌచ్ ఇష్యూ

మహిళా నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్‌లో సీన్ సితార అవుతోంది. లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చిన హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీనీ వణికిస్తోంది.

why Justice Hema Committee shakes Malayalam film industry

Mollywood  MeeToo: ఒక ఒకే రిపోర్ట్ మలయాళీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మహిళా నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మాలీవుడ్‌లో సీన్ సితార అవుతోంది. లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీనీ వణికిస్తోంది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం హీరోయిన్ భావనకు కేరళలో ఎదురైన ఘటనతో అప్పుడు హేమ కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ హేమ కమిటీ ఈ మధ్యే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టడంతో రోజుకొకరు చొప్పున నటీమణులు బయటకు వచ్చి తమకు గతంలో ఎదురైన సంఘటనలను చెబుతుండటంతో ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద దుమారం లేపుతోంది.

మోహన్‌లాల్‌ రాజీనామా
ఇప్పటివరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

అక్కడ ఉండలేక బయటకు వచ్చేశా..
ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు ముఖేశ్‌, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మిను మునీర్ ఆరోపించింది. 2013లో ఒక ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నప్పుడు తనను అసభ్య పదజాలంతో తిట్టారని మిను చెప్తోంది. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్‌ చేయాలనుకున్నా.. వేధింపులు తట్టుకోలేకపోయానని ఈ ఘటనతో తాను మానసికంగా ఎంతో కుంగిపోయానన్నారు మిను మునీర్. పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్లినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ నటీ శ్రీలేఖ మిత్రా చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఆడిషన్‌లో భాగంగా దర్శకుడిని కలిశానని.. ఆయన తన చేతి గాజులను తాకారని ఆరోపించారు. తర్వాత మెడపై చేయి వేశారని.. అక్కడ ఉండలేక బయటకు వచ్చేశానని చెప్పారు.

సిద్ధిఖీపై రేవ‌తి సంపత్ ఆరోపణలు
అది మరువక ముందే ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత సిద్ధిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేయడంతో పాటు తన ఫ్రెండ్స్‌తో కూడా ఇబ్బంది పెట్టాడంటూ నటి రేవ‌తి సంపత్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ప్రస్తుతం మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణల వల్లే ప‌ద‌వి నుంచి తప్పుకున్నానని.. ఈ పరిస్థితిలో తాను పదవిలో కొనసాగడం సరికాదన్నారు సిద్దిఖీ. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తానని సిద్ధిఖీ తెలిపారు. పలువురు నటులతో పాటు అమ్మ కమిటీలోని సభ్యులపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో వరుసపెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు రిజైన్ చేశారు. అందులో కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి.

జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
హేమ కమిటీ రిపోర్ట్.. మాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది. అగ్రహీరోలు, డైరెక్టర్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు నటీమణులు. రిపోర్ట్ బయటికి వచ్చాక చాలామందిపై అలిగేషన్స్ వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఈ మధ్య విడుదల చేసిన నివేదిక.. కేరళలో ప్రకంపనలు రేపింది. రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జి హేమ.. ఆ క‌మిటీని లీడ్ చేశారు. న‌టి శార‌దతో పాటు మాజీ సివిల్ స‌ర్వీస్ అఫిషియ‌ల్ కేబీ వాత్సల కుమారి ఆ క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు.

2017లో హేమ కమిటీ ఏర్పాటు
ప్రముఖ నటిపై జరిగిన లైంగిక వేధింపుల నేపథ్యంలో కేరళ హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో 2017లో రాష్ట్ర ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2019 వరకు రిపోర్ట్ రెడీ చేసింది. అయితే మాలీవుడ్‌కు చెందిన ఓ నటుడు హేమ కమిటీ రిపోర్ట్‌ను విడుదల చేయొద్దంటూ కోర్టుకెళ్లారు. ఆ తర్వాత చాన్నాళ్లు కోర్టు స్టేతో హేమ కమిటీ రిపోర్ట్ విడుదల ఆగిపోయింది. కోర్టు స్టే ఎత్తేయడంతో కేరళ ప్రభుత్వం ఈ మధ్యే రిపోర్ట్‌ను బయటపెట్టింది. కమిటీ ఏర్పాటు చేసి ఏడేళ్లు అయింది. రిపోర్ట్ రెడీ అయి ఐదేళ్లు అయింది. అందులోని వివరాలు బయటికి రావడానికి ఎన్నో అవాంతరాలు దాటాల్సి వచ్చింది. 2017లో కమిటీ ఏర్పాటు చేస్తే.. 2024 అసలు విషయాలు వెలుగులోకి రావడంతో రచ్చ జరుగుతోంది.

Also Read: పవన్ కల్యాణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మెగా ఫ్యామిలీ.. పిఠాపురానికి అల్లు అర్జున్!

మాలీవుడ్‌లో పురుషుల మాఫియా ఆధిపత్యం
మాలీవుడ్ ఇండస్ట్రీలో శక్తివంతమైన పురుషుల మాఫియా ఆధిపత్యం నడుస్తోందని హేమ కమిటీ స్పష్టం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయని చెప్పింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావాలంటే చాలా సందర్భాల్లో మహిళలు లైంగికంగా కోరికలు తీర్చాలనే డిమాండ్ ఎక్కువగా ఉందని.. సినిమాలో ఏదైనా పాత్ర ఇస్తే సర్దుబాట్లు.. రాజీ చేసుకోవాలని చెప్పినట్లు కూడా కమిటీ వెల్లడించింది. ఇక జూనియర్ ఆర్టిస్టుల ఇబ్బందులు అయితే తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది హేమ కమిటీ రిపోర్ట్. కనీస వసతులు కూడా కల్పించకుండా.. పైగా లైంగికంగా వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. చాలా సందర్భాల్లో నటీమణులను బలవంతపెడుతున్నారని.. పురుషులు బలవంతంగా లేడీ ఆర్టిస్టుల గదిలోకి వస్తారని రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఇవే కాదు హేమ కమిటీ నివేదిక పూస గుచ్చినట్టు మరిన్ని విషయాలను స్పష్టం చేసింది.

Also Read: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. శనివారం వస్తే నాని ఏం చేస్తాడు..?

వారు చెప్పిందే రాజ్యాంగం అన్నట్లు బిహేవ్ చేస్తారు..
మలయాళ సినీ ఇండస్ట్రీలో 15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటీనటుల ఆధిపత్యం కొనసాగుతుందని.. వారు చెప్పిందే రాజ్యాంగం అన్నట్లు బిహేవ్ చేస్తారని హేమ కమిటీ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. చాలా మంది నటీమణులు హేమ కమిటీ నివేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మలయాళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. దాంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. నటీమణుల సమస్యలపై వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని కేరళ CMO తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు