హైదరాబాద్ లో భారీ వర్షం

  • Publish Date - June 4, 2020 / 12:35 PM IST

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం(జూన్ 4,2020) సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా వాన ప్రారంభమైంది. వాన రాకతో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది.  ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు క్యుములోనింబస్‌ మేఘాలతో గ్రేటర్‌లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇదివరకే తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశముందన్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇదివరకే తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, యాదాద్రి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు