Congress: ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు.. చేరికలు ఎందుకు అంటూ

చేరికలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఇప్పటికే కొత్త, పాత నేతల మధ్య సయోధ్య కుదర్చలేక ఇబ్బంది పడుతున్న ముఖ్యనేతలకు.. ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చి పడింది. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తామంటే.. చేర్చుకోవద్దంటూ.. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు అడ్డుపడుతున్నారు. తమకు ఇష్టం లేకుండా ఎవరినైనా చేర్చుకుంటే.. లోక్‌సభ ఎన్నికల్లో సహకరించేది లేదని చేతులు ఎత్తేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పెద్దఎత్తున చేరికలను ప్రోత్సహించారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వీడినవారితో పాటు.. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఏఐసీసీ ఆదేశాలతో.. సీనియర్ నేతలు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోదండరెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. అన్ కండిషనల్‌గా ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకోవాలని ఏఐసీసీ స్పష్టం చేసింది.

నిరసనలు..
ఏఐసీసీ ఆదేశాలతో చేరికల కమిటీ దూకుడు పెంచింది. గాంధీభవన్‌కు ఎవరు వచ్చినా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జి దీపాదాస్ మున్షి కూడా నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు పార్టీలో పెద్ద దుమారం రేపుతుంది. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

దేవరకద్రలో కాటం ప్రదీప్ కుమార్ గౌడ్‌ను సాయంత్రం చేర్చుకుంటే.. స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో అర్ధరాత్రి 12 గంటలకు ఆయన చేరికను నిలిపేస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మిర్యాలగూడలో మున్సిపల్ చైర్మన్ పార్టీలో చేరిన గంటల వ్యవధిలో మళ్లీ నిలిపిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

ఆదిలాబాద్‌లో పార్టీ మాజీ నేతలు గండ్ర సుజాత, సాజిద్ ఖాన్, రామచంద్రారెడ్డిలు తిరిగి పార్టీలో చేరితే.. ప్రస్తుతం ఉన్న నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని పార్టీలో చేర్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయమంటూ భీష్మించి కూర్చున్నారు. దీంతో చేసేది లేక వారి చేరికను కూడా నిలిపేశారు. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విషయంలో.. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ కొత్తవారి చేరికల విషయంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

భిన్నస్వరాలు
గాంధీ భవన్‌లో కూడా చేరికల విషయంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులనే కాంగ్రెస్ చేస్తుందంటూ పలువురు నేతలు పెదవివిరుస్తున్నారు. ఇప్పుడు వస్తామంటున్న నేతలెవరూ లేకపోయినా..అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు..చేరికలు ఎందుకు అంటూ మండిపడుతున్నారు. ప్రజల ఆదరణ కోల్పోయిన నేతలు పార్టీలోకి వచ్చినా ఉపయోగం ఉండదంటూ చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ముందుకు పోతే నుయ్యి.. వెనకకు పోతే గొయ్యి అన్నట్లు తయారైంది. కొత్త నేతలను పార్టీలో చేర్చుకుంటే ఉన్న నేతలు సైలెంట్ అవుతున్నారు. బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలను చేర్చుకోకపోతే వాళ్లు బీజేపీలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Also Read: ఎన్నికల వేళ.. మహిళ అపహరణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు