Semi Bullet Train : రూటు మారింది.. అమరావతికి గంటన్నరలోపే.. గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కనే సెమీ బుల్లెట్ ట్రైన్..
Semi Bullet Train : ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలోపు పూర్తి చేయాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే ఏఏ గ్రామాల మీదుగా అలైన్మెంట్ వెళ్తుందనే కచ్చితమైన వివరాలతో త్వరలో నోటిఫికేషన్లు వెలవడే అవకాశం ఉంది.
Semi Bullet Train
- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే సెమీ బుల్లెట్ ట్రైన్ లైన్
- ప్రాథమిక అలైన్మెంట్ రెడీచేసి సీఎంకు పంపిన రైల్వేశాఖ
- హైదరాబాద్ టూ అమరావతికి గంటన్నరలోపే చేరుకోవచ్చు
Semi Bullet Train : తెలంగాణ రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి గంటన్నరలో దూసుకెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి చెన్నైకు కేవలం 3 నుంచి 3.30 గంటల్లోనే చేరుకోవచ్చు.
హైదరాబాద్ టూ చెన్నై మార్గంలో సెమీ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హైస్పీడ్ కారిడార్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలతో ప్రాజెక్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. గతంలో పేర్కొన్న రూట్‌కు బదులు ప్రస్తుతం నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కనుంచే రైల్వేలైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం ప్రతిపాదనకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకు వెళ్లే హైస్పీడ్ రైలుకు మిర్యాలగూడ మీదుగా సాగే కొత్త మార్గంలో ప్రాథమిక సర్వే పూర్తిచేసి, అలైన్మెంట్ డ్రాఫ్ట్‌ను రైల్వే బోర్డు సిద్ధం చేసింది.
హైదరాబాద్ టూ చెన్నై హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే.. ఏపీ, తెలంగాణ రాజధానుల మధ్య దూరం సగానికిసగం తగ్గుతుంది. ప్రస్తుతం రైలులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఐదు గంటల సమయం పడుతుంది. అదే సెమీ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే గంటన్నర సమయంలోనే హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి చేరుకోవచ్చు.
ఇదిలాఉంటే.. ఒకే కారిడార్‌లో రోడ్డు, రైలు మార్గాలు ఉండటం వల్ల లాజిస్టిక్స్ ఖర్చు భారీగా తగ్గుతుంది. సెమీ బుల్లెట్ ట్రైన్ గంటకు 250 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో దూసుకుపోయేలా టెక్నాలజీని వినియోగిస్తారు. దీంతో ఈ కారిడార్‌ను నేరుగా చెన్నై వరకు పొడిగించడం ద్వారా హైదరాబాద్ టూ చెన్నైకు మూడు నుంచి మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే ఐదేళ్లలోపు పూర్తి చేయాలని పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే ఏఏ గ్రామాల మీదుగా అలైన్మెంట్ వెళ్తుందనే కచ్చితమైన వివరాలతో త్వరలో నోటిఫికేషన్లు వెలవడే అవకాశం ఉంది.
