MCC: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఏమేం చేయకూడదో తెలుసా?

ఈసీఐ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో ఈ నిబంధనలను అమలు చేస్తుంది.

కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడంతో మంత్రులు, ఇతర అధికారులు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడానికి వీలు ఉండదు. శంకుస్థాపనలు లేదా ఏ రకమైన ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదు.

రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం మొదలైన వాటికి సంబంధించిన హామీలు ఇవ్వకూడదు. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను జరపడానికి రాజ్యాంగ అధికారం ప్రకారం ఈసీఐ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో ఈ నిబంధనలను అమలు చేస్తుంది. ఎన్నికల సర్వేలను ప్రకటించకూడదు. ప్రభుత్వ అధికారులను పార్టీలు ఎన్నికల కోసం వాడుకోకూడదు.

  • కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలి
  • పబ్లిక్ ఆస్తులు- బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు, రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నీటినీ వెంటనే తొలగించాలి
  • ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలి
  • ప్రభుత్వ వెబ్ సైట్ లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలి
  • ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదు

ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకోవచ్చని చెప్పారు. కేవైసీ యాప్ లో అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఎవరైనా తాయిలాలు, నగదు పంచితే ఫొటో తీసి తమకు పంపాలని రాజీవ్ కుమార్ కోరారు.

సెల్ ఫోన్ లొకేషన్ ను బట్టి 100 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకుంటామని చెప్పారు. ధనబలం, కండబలం నియంత్రణ తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరిస్తామని వివరించారు. ఓటర్లు ఫేక్ న్యూస్ ను షేర్ చేయకూడదని అన్నారు. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంటుందని తెలిపారు.

మోగిన నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ట్రెండింగ్ వార్తలు