YS Sharmila: అన్న వైఎస్ జగన్‌తో తాడోపేడో తేల్చుకునే దిశగా షర్మిల!

ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నట్లు సంకేతాలు పంపుతున్నట్లేననే..

తాము రాజేసిన అగ్గి.. తమ కొంపనే అంటుకుంటే ఎలా ఉంటుంది..? ఏపీలో అన్నాచెల్లెళ్ల జగడం మాదిరిగానే ఉంటుంది. జగనన్న వదిలిన బాణం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల… ఇప్పుడు అదే జగన్‌కు ఏకు మేకులా తయారయ్యారా? అంటే అంతా ఔననే అంటున్నారు.

తెలంగాణ రాజకీయాల నుంచి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల పుట్టినింట అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో సొంత అన్ననే టార్గెట్‌ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇండియా కూటమి స్నేహ హస్తం చాస్తున్నా… తను మధ్యలో ఎంట్రీ ఇచ్చి రిక్తహస్తం చూపించడానికి కారణమేమై ఉంటుంది? అన్నా చెల్లెళ్ల మధ్య రాజీ కుదరదా? సీఎం సీటు నుంచి అన్నను దించేసినా… ఇంకా కసి, కోపం చల్లారలేదా? షర్మిల టార్గెట్‌ ఏంటి? జగన్‌తో జగడం ఎన్నాళ్లు….?

రాజన్న బిడ్డల మధ్య రాజకీయ పోరాటం తగ్గేదేలే అన్నట్లు సాగుతోందా?. ఎన్నికల ముందు కడప గడ్డపై నుంచి అన్న జగన్‌తోపాటు వదిన భారతిపైనా పవర్‌ ఫుల్‌ పంచులతో దుమ్ము రేపిన పీసీపీ చీఫ్‌ షర్మిల… ప్రతిపక్షంలోనూ మాజీ సీఎం జగన్‌పై కరుణ చూపే ప్రసక్తే లేదంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు చెక్‌ చెప్పేలా షర్మిల దూకుడు ప్రదర్శిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

జగన్‌నే ఎక్కువగా టార్గెట్‌ చేస్తూ..
ఇటు అధికార పార్టీ టీడీపీపైనా… సీఎం చంద్రబాబుపైనా విమర్శలకు దిగుతున్న షర్మిల అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌నే ఎక్కువ టార్గెట్‌ చేయడం టాక్‌ ఆఫ్‌ ద ఏపీగా మారింది. జగన్‌ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న షర్మిల… రోజురోజుకూ తన మార్క్‌ పాలిటిక్స్‌తో పొలిటికల్‌ సర్కిల్స్‌ను ఆకర్షిస్తున్నారు.

ఎన్నికల ముందు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల… తన ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం జగన్‌ వైఫల్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అలా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పతనానికి కారణమయ్యారంటున్నారు. ఇక ఎన్నికల తర్వాత అదే దూకుడు ప్రదర్శిస్తున్న షర్మిల… రాజకీయంగా తాను ఎదగాలంటే… వైసీపీ పతనమవ్వాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

వైసీపీ అధినేత జగన్‌ ఒకటంటే… తాను వంద అంటా అన్నట్లు… ఫైర్‌ అవుతున్న షర్మిల… జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అడుగులు వేస్తున్నారంటున్నారు. అధికారపక్షం కన్నా… తనే ఎక్కువగా వైసీపీ బాస్‌ జగన్‌ను టార్గెట్‌ చేయడానికి ప్రధాన కారణం.. ఏపీలో వైసీపీ స్థానంలో కాంగ్రెస్‌ను చేర్చాలనే షర్మిల వ్యూహమేనంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి… రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌కు మళ్లీ నూతన జవసత్వాలు నింపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న షర్మిల… వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేస్తేనే కాంగ్రెస్‌ బలోపేతమవుతుందని… తాను రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతానని భావిస్తున్నారట షర్మిల. అందుకే ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తూ… వైసీపీని.. ఆ పార్టీ అధినేత జగన్‌ను కార్నర్‌ చేసేలా అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

నిరూపించుకునే ప్రయత్నాలు
పీసీసీ అధ్యక్షురాలైన తర్వాత తన తండ్రి వైఎస్‌ అభిమానులను మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన షర్మిల… అప్పటికే ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. ఇక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్‌ నేతల ఆలోచనల్లో మార్పు రావాలంటే.. జగన్‌ కన్నా తన నాయకత్వమే బలమైనదని నిరూపించుకునేలా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకుల్లో 90 శాతం మంది కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లినవారే… అలా వెళ్లినవారిలోనూ ఎక్కువ మంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ అనుచరులే. ఇలా వెళ్లినవారంతా మళ్లీ వెనక్కి రావాలంటే.. వైఎస్‌ వారసత్వం కొనసాగించడం.. వైఎస్‌లా సాహసోపేతంగా రాజకీయం చేయడం తనకే సాధ్యమన్న సంతకేతాలివ్వడంలో భాగంగానే జగన్‌పై షర్మిల గురిపెట్టినట్లు భావిస్తున్నారు పరిశీలకులు.

నాయకురాలిగా తన సమర్థతను చాటుకుంటే వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్‌ నాయకులు అంతా మళ్లీ కాంగ్రెస్‌ గూటికి వచ్చేలా ప్లాన్‌ చేస్తున్న షర్మిల… రాజకీయంగా జగన్‌ను ఏకాకిని చేయాలని… ఇందుకోసం చాలా సమయం పట్టొచ్చని… వచ్చే ఐదేళ్లలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేననంటూ సన్నిహితులతో చెబుతున్నారట షర్మిల. ఇదే సమయంలో అధికార పార్టీతో తాను మిలాకత్‌ అయ్యారనే విమర్శలు ఎదుర్కోకుండా… తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇటు అధికార పార్టీ.. అటు ప్రతిపక్షంపై విమర్శల దాడి చేస్తున్న షర్మిల… ఎక్కువగా వైసీపీ బాస్‌ జగన్‌నే ఎండగట్టడం వల్ల.. ఆ పార్టీ కూడా మరింత డిఫెన్స్‌లో పడిపోతుందంటున్నారు. షర్మిలను విమర్శిస్తే వైఎస్‌ అభిమానులు ఎలా రియాక్ట్‌ అవుతారనే భయం కూడా వైసీపీ నేతల్లో కనిపిస్తోందంటున్నారు. ఎన్నికల ముందు షర్మిలపై ఎక్కువగా విమర్శల దాడి చేయడం వల్ల రాయలసీమలో వైఎస్‌ అభిమానుల ఓట్ల చీలిక వచ్చిందనే అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోందంటున్నారు. దీనివల్ల ఇప్పుడు షర్మిల దాడి పెంచినా… వైసీపీ నుంచి ఎలాంటి ప్రతిదాడి ఉండటం లేదు. ఇది కూడా తనకు అనుకూలంగా మలచుకుంటున్న షర్మిల… గురిచూసి వైసీపీని కొడుతున్నారంటున్నారు.

జగన్‌ విఫలమవడంతోనే ఓటమి
పాలకుడిగా జగన్‌ విఫలమవడంతోనే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో తన తండ్రి వైఎస్‌ లేరని… వైఎస్‌ఆర్‌ అంటే… విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి అన్నట్లు విమర్శల దాడి చేస్తున్న షర్మిల… జగన్‌ వేసే ప్రతి అడుగును… మాటాడే ప్రతిమాటకూ కౌంటర్‌ ఇస్తూ.. కార్నర్‌ చేస్తూ దూకుడు చూపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యను రాజకీయ దాడిగా జగన్‌ అభివర్ణిస్తే…. తన విచారణలో వ్యక్తిగత కక్షగా తేలిందని చెప్పిన షర్మిల… వైసీపీకి గాలి తీసేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణించాయని ఆరోపిస్తూ జగన్‌ ఢిల్లీలో ధర్నా చేస్తే… తన బాబాయ్‌ వివేకా హత్యపై ఎందుకు ధర్నా చేయలేదంటూ ప్రశ్నించడం ద్వారా జగన్‌కు చిక్కులు సృష్టించే ప్రయత్నం చేయడం కూడా షర్మిల అటాకింగ్‌ పాలిటిక్స్‌కు నిదర్శనమంటున్నారు.

ఇక తాజాగా షర్మిల చేసిన ట్వీట్‌ కూడా ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఢిల్లీలో ధర్నా చేసిన జగన్‌కు ఇండి కూటమి నేతలు బాసటగా నిలిస్తే… కాంగ్రెస్‌ మాత్రం కాస్త దూరంగానే ఉండిపోయింది. అయితే ఇదే అంశంపై తనకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వాలని జగన్‌ కోరితే… ఎందుకు ఇవ్వాలి? దేనికోసం మద్దతు చెప్పాలంటూ షర్మిల ఫైర్‌ అవ్వడం పొలిటికల్‌గా ఇంట్రెస్టింగ్‌గా మారిందంటున్నారు.

ఒక్క ట్వీట్‌ ద్వారా జగన్‌ను పూర్తిగా ఏకి పారేసిన షర్మిల… ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నట్లు సంకేతాలు పంపుతున్నట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సూటిగా.. స్పష్టంగా వాగ్బాణాలను సంధిస్తున్న షర్మిల…. వైసీపీని, తన అన్న జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీస్తేనే.. తనకు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం పెరుగుతుందనే ఉద్దేశంతోనే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి అన్నా చెల్లెళ్ల మధ్య జగడం ఏ స్థాయికి వెళుతుంది? ఎవరిది పైచేయి అవుతుందనేదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏదిఏమైనా షర్మిల ఎటాకింగ్‌ పాలిటిక్స్‌తో జగన్‌ డిఫెన్స్‌లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులను మాజీ సీఎం జగన్‌ ఎలా అధిగమిస్తారనేది చూడాల్సివుంది.

Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు: చంద్రబాబు

ట్రెండింగ్ వార్తలు