Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు: చంద్రబాబు

పోలవరం, అమరావతి నాశనం అయిపోయాయని..

Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలో ఉన్నాయని తెలిపారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు.

ప్రత్యేక హోదాకు బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్‌కి సాయం చేస్తామని చెప్పారని చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన ఐదేళ్లలో ఏపీ అధ్వానమైన పరిస్థితికి వెళ్లిందని తెలిపారు. తలసరి ఆదాయం పడిపోయిందని అన్నారు. పోలవరం, అమరావతి నాశనం అయిపోయాయని తెలిపారు. పరిశ్రమలు పారిపోయాయని అన్నారు.

ప్రజలు ఎన్డీఏపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల అన్యాయం జరిగింది కాబట్టి ఏపీ పునర్నిర్మాణం కోసం సహాయం అడుగుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి నష్టం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు ఎన్డీఏకి చారిత్రాత్మక విజయాన్ని ఇచ్చారని అన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తమకు ఇచ్చారని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలే అడుగుతున్నామని చెప్పారు. స్వచ్ఛ భారత్, జల జీవన మిషన్‌లో గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెనుకబడి ఉందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని అన్నారు.

Also Read: ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ నేతలు ఏమైనా చేస్తారా? అనే అనుమానం ఉంది: కేటీఆర్ కామెంట్స్