Somavaram Shiva Puja Significance : శివుడికి అత్యంత ఇష్టమైన సోమవారం.. నేడు సాయంత్రం పూజలో ఇలా చేస్తే చాలు.. మీ దశ తిరుగుతుంది..!
Somavaram Shiva Puja Significance :
why monday is special for lord shiva and importance of somavaram how to worship details here
Somavaram Shiva Puja Significance : హిందూ క్యాలెండర్ ప్రకారం వారంలోని ఒక్కో రోజుని ఒక్కో దేవుడికి కేటాయించారు. ఆయా రోజుల్లో ఆ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయని.. జీవితంలో కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. దీనిలో భాగంగానే వారంలో తొలి రోజు అయిన సోమవారాన్ని పరమశివుడికి కేటాయించారు. మరి భోళా శంకరుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు ఈశ్వరుడిని పూజిస్తే జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మరి ఇంతకీ సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎందుకు అంత ప్రీతి.. మరి ఈ రోజు ఈశ్వరుడిని ఎలా పూజిస్తే.. ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనే వివరాలు..
శివుడికి సోమవారం అత్యంత ప్రీతి పాత్రం కావడానికి ప్రధాన కారణం ఆయనకు చంద్రుడితో ఉన్న సంబంధమే. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (నక్షత్రాలను).. చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే చంద్రుడు మాత్రం.. రోహిణిపై ప్రత్యేక ప్రేమ, అభిమానం కనబరుస్తాడు. మిగిలిన భార్యల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. దీంతో చంద్రుడు తమను సరిగా పట్టించుకోవడం లేదంటూ మిగతా భార్యలు ఏడ్చుకుంటూ.. వారి తండ్రి అయిన దక్షుడి వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటారు. దీంతో దక్షుడు చంద్రుడిని పిలిచి.. రోహిణితో పాటు మిగతా భార్యలను కూడా సమానంగా చూడాలని నచ్చజెబుతాడు. అయినా చంద్రుడి తీరులో మార్పు రాకపోవడంతో.. ఆగ్రహానికి గురైన దక్షుడు.. అల్లుడిని శపిస్తాడు. చంద్రుడిలోని తేజస్సు, ప్రకాశం తగ్గిపోవాలని శపిస్తాడు. దక్షుడి శాపం వల్ల చంద్రుడు రోజు రోజుకీ తన ప్రభావంతో పాటు పరిమాణాన్ని కూడా కోల్పోతూ వస్తుంటాడు.
దీని గురించి ఆందోళన చెందిన చంద్రుడు వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్లి తన శాపం గురించి చెప్పుకుని.. తనను రక్షించమని సృష్టికర్తను వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ.. ఆ పని తన వల్ల కాదని.. పరమేశ్వరుడే చంద్రుడికి సాయం చేయగలడని చెబుతాడు. బ్రహ్మ సూచన మేరకు చంద్రుడు పరమేశ్వరుడి కటాక్షం కోసం ప్రభాస తీర్థంలో శివుడిని ధ్యానిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన భోళాశంకరుడు అతడిని తన శిరస్సుపై ధరించి చంద్రుడికి పునర్జీవం ప్రసాదిస్తాడు. అలానే చంద్రుడికి సోముడు అనే పేరు కూడా ఉంది. శివుడు అభయమిచ్చిన రోజు సోమవారం కావడంతో శివుడికి ప్రీతికరమైన రోజైంది. చంద్రుడిని ధరించడం వల్ల పరమశివుడిని చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు.
సోమవారం శివుడిని ఆరాధించడం వల్ల..
శివుడికి ఇంత ప్రత్యేకమైన సోమవారం నాడు ఈశ్వరుడిని పూజించడం వల్ల పుణ్యం లభించడం మాత్రమే కాక.. మానసిక, భౌతిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సోమవారం నాడు శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే.. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు ‘మనఃకారకుడు’. అందుకే సోమవారం ఈశ్వరుడిని పూజించడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు తొలగి, ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే ‘మృత్యుంజయ’ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలానే సోమవారం నాడు శివుడికి పూజ చేసి.. ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసేవారికి ఐశ్వర్యం, మంచి సంతానం కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఎలా పూజించాలి
భోళా శంకరుడు అభిషేక ప్రియుడు. భక్తులు మనస్ఫూర్తిగా ఆయనను వేడుకుంటే చాలు.. కోరిన కోర్కెలు నెరవేరుస్తాడు. ఆయన పూజకు కూడా ఖరీదైన వస్తువులు, పదార్థాలు అక్కర్లేదు. శుద్ధమైన జలం, పాలు, పెరుగు, తేనె లేదా పంచామృతాలతో అభిషేకం చేస్తే.. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడు. అలానే పూజ చేసేటప్పుడు శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలు (మారేడు దళాలు) సమర్పించడం వల్ల మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు తెలుపుతున్నారు. పూజ చేసే సమయంలో ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుందంటున్నారు. సోమవారం సాయంత్రం వేళ శివాలయంలో నెయ్యితో దీపం వెలిగిస్తే.. జీవితంలోని చీకట్లు తొలిగిపోతాయని నమ్ముతారు.
