Hindu Temple In Pakistan : పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయానికి తాళం..
200 Year Old Hindu Temple In Pakistan : పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్యా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్‌లో ఉన్న రామ్‌లీలా ఆలయానికి అధికారులు సీల్ వేశారు.
200 Year Old Hindu Temple In Pakistan
200 Year Old Hindu Temple In Pakistan : పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్యా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్‌లో ఉన్న రామ్‌లీలా ఆలయానికి అధికారులు సీల్ వేశారు. దాదాపు 200ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హిందూ ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించడం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక హిందూ సమాజం, పౌర హక్కుల కార్యకర్తలు, వ్యాపారులు నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు ఆ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తాళం వేశారు. చారిత్రక కట్టడాన్ని కూల్చి అక్కడ వాణిజ్య సదాయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేయడంతో నిరసనలు వెల్లువెత్తాయి.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని రహీమ్ బజార్ ప్రాంతంలో ఈ రామ్‌లీలా ఆలయం ఉంది. ఆలయాన్ని కూల్చివేసే పనులు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో డేరా సివిల్ సొసైటీ అధ్యక్షుడు సోహైల్ అహ్మద్ అజ్మీతో పాటు స్థానికులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థలంలో కమర్షియల్ ప్లాజా నిర్మించేందుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు ఓ వ్యక్తి చెప్పాడని అజ్మీ వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం హిందూ సంఘాల ప్రతినిధులు, పౌర సమాజ కార్యకర్తలు సమావేశమై ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ స్థలంపై యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి? అక్కడ వాణిజ్య నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోనూ లేవనెత్తాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు
డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో సుమారు 400 భవనాలను సాంస్కృతిక వారసత్వ కట్టడాలుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆలయం కూడా ఆ జాబితాలో ఉంది. పాకిస్థాన్‌లో హిందూ, సిక్కు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆల్ పాకిస్థాన్ హిందూ రైట్స్ మూవ్మెంట్ అధ్యక్షుడు హరూన్ సరబ్ డయల్ కోరారు. మతపరమైన ఆస్తులపై అక్రమ ఆక్రమణలు, విక్రయాలు జరిగాయనే ఆరోపణలపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కులు, మతపరమైన వారసత్వ కట్టడాల భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మైనారిటీలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో రామ్ లీలా ఆలయ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయాన్ని సీల్ చేసిన అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
