Private Jet Crash : ఘోర విమాన ప్రమాదం.. జనావాసాలపై కూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది సజీవ దహనం..
Florida Private Jet Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ జెట్ అదుపు తప్పి నేరుగా జనావాసాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Florida Plane Crash
Florida Private Jet Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ జెట్ అదుపు తప్పి నేరుగా జనావాసాలపై కుప్పకూలింది. క్షణాల్లోనే భారీ మంటలు చెలరేగడంతో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు, సమీపంలోని ఇళ్లకు అతి దగ్గరలో విమానం కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read : Cyclone Murasu : మురసు తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రంలో పామ్ బీచ్ కౌంటీలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్లోని ఆస్టిన్-బెర్గ్స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ జెట్ బహామాస్ దీవులకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదంకు ముందు 8వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుంది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారినట్లు కాక్పిట్లో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగులు వెలుగులోకి వచ్చాయి.
పైలట్ తొలుత విమానంపై మంచు పేరుకుపోయిందని చెప్పినట్లు వినిపించింది. తొలుత నిమిషానికి 10వేల అడుగుల వేగంతో కిందకు దిగిన విమానం.. ఆ తరువాత నిమిషానికి 20వేల అడుగులు.. చివరకు 30వేల అడుగుల వరకు దిగజారినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్స్ , ప్లైట్ ట్రాకింగ్ సమాచారం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. మేడే.. మేడే.. అంటూ సహాయం కోరాడు. విమానం వేగంగా దిగుతోందని, నేలను ఢీకొట్టబోతున్నామని చవరిగా హెచ్చరించినట్లు రేడియో సంభాషణల్లో వెల్లడైంది. ఆ తరువాత సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానం అత్యంత వేగంతో నేలను ఢీకొట్టిన వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో విమాన శకలాలు, రోడ్డుపై ధ్వంసమైన భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వాటి చుట్టూ మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. విమాన ప్రమాదం ఇళ్లకు, కార్లకు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘోర విమాన ప్రమాదం కారణంగా.. విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మరణించగా.. నేలపై ఎలాంటి మరణాలు సంభవించలేదని.. ఆస్తినష్టం సంభవించిందని ప్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిన్ తెలిపారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. విమానం కూలిపోవడానికి మంచు పేరుకుపోవడం, వాతావరణ ప్రతికూల పరిస్థితులు కారణమా? లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా? అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
