Gachibowli Suicide: గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. ఐటీ కారిడార్‌లో కలకలం!
Gachibowli Suicide: హైదరాబాద్ గచ్చిబౌలిలోని జయభేరి అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి ముగ్గురు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
Three of a family including software engineer commit suicide in gachibowli jayabheri apartments
Gachibowli Suicide: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గౌలిదొడ్డి ప్రాంతంలో ఉన్న జయభేరి అపార్ట్మెంట్ సీ-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు(Gachibowli Suicide) ఆదివారం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉదయం సమయంలో ఈ ఘోరం వెలుగులోకి రావడంతో అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మృతులు మారెడ్డి, భారతి, నిశాంత్ రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కుమారుడు:
ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని బాతుల మారెడ్డి, ఆయన భార్య భారతి, కుమారుడు నిశాంత్ రెడ్డిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గత ఒక ఏడాది కాలంగా వీరు ఈ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. మృతుడు నిశాంత్ రెడ్డి నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు సమచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ కలహాలా? కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు:
కుటుంబంలో తలెత్తిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా కుటుంబ అంతర్గత కలహాలే ఈ ఆత్మహత్యలకు దారితీసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అసలు కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వేర్వేరు కోణాల్లో విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ద్వారా సాక్ష్యాధారాలు సేకరిస్తూ, ఆర్థిక సమస్యలు లేదా మరేవైనా ఇతర ఒత్తిళ్లు కారణమా అనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
