AP Rains Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్.. హెచ్చరికలు జారీ
AP Rains Alert : ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది
Meteorological Department AP Rains Alert in Several Districts Today
AP Rains Alert: ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఎనిమిది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Also Read : ఏపీ రైతులకు పండుగ గిఫ్ట్.. ఖాతాలో ఒకేసారి రూ.6వేలు? అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్!
పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (AP Rains) కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల సమీపంలో ఆశ్రయం పొందవద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు హెచ్చరికలను గమనించాలని సూచించారు.
మరోవైపు.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి.
వర్షాల నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం తెచ్చిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వలను తడవకుండా టార్పాలిన్లతో భద్రపరుచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
