Wanaparthy Politics: వనపర్తి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందో తెలుసా?

హెలిప్యాడ్ వద్ద మంత్రులకు స్వాగతం పలికే సందర్భంలోనూ హైడ్రామా కనిపించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరూ ఒకే మాట… ఒకే బాట అన్నట్లు నడిచారు. కాంగ్రెస్‌ జెండా ఎగరడమే అజెండాగా పనిచేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక సీన్‌ కట్‌ చేస్తే… ఎనిమిది నెలల్లోనే అంతా రివర్స్‌. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేలా ఆధిపత్య పోరు.

అధికార పార్టీలో ఉన్న ఆ ఇద్దరు నేతల తీరు ప్రతిపక్షానికి కనువిందు చేస్తోంది. అయినా ఆ ఇద్దరూ తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లే తలపడుతున్నారు. నువ్వా.. నేనా అన్నట్లు సాగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది… సీఎం సొంత జిల్లాల్లో పొలిటికల్‌గా హీట్‌పుట్టిస్తున్న ఆ నేతలు ఎవరు? వారి మధ్య గొడవలకు కారణమేంటి..?

ఇద్దరి మధ్య విభేదాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన ఆధిపత్య పోరు ఇటీవల రచ్చకెక్కుతోంది. ఇద్దరు నేతలు పోటాపోటిగా వ్యవహరిస్తూ కార్యకర్తలను ఇరకాటంలోకి నెడుతున్నారు.

ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకునేందుకు ఇద్దరూ పోటీపడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య నలిగిపోతూ కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు ప్రొటోకాల్ పేరుతోనూ ఇద్దరు రగడ చేస్తుండటం అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఆయనను కాదని ఈయన… ఈయనను కాదని ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుండటం వివాదాలకు కారణమవుతోంది.

ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఇద్దరు నేతలు.. తమ నియోజకవర్గంలో ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు ఇప్పుడు ప్రతిష్టకు పోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో కేబినెట్ సబ్ కమిటీ పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య వర్గపోరు బయటపడింది.

ఫ్లెక్సీల వార్
మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టరెట్ వద్ద చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి మధ్య ఫ్లెక్సీల వార్ పొలిటికల్‌గా హీట్ పెంచింది. మంత్రులకు స్వాగతం పలుకుతూ పట్టణంలో ఇరువురు నేతలు వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చిన్నారెడ్డి అనుచరులు ముద్రించిన ప్లక్సీల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫొటోలు కనిపించలేదు. అదేవిధంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు వేసిన ఫ్లెక్సీలో చిన్నారెడ్డికి చోటు కల్పించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలపై బహిరంగ చర్చ జరుగుతోంది.

హెలిప్యాడ్ వద్ద మంత్రులకు స్వాగతం పలికే సందర్భంలోనూ హైడ్రామా కనిపించింది. ఎవరి అనుచరులతో వారు వేర్వేరుగా మంత్రులకు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ చెరోవైపు తమ అనుచరులను మోహరించడమే కాకుండా… మంత్రులకు తమ అనుచరులను పరిచయం చేసే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే విభేదాలు ఉండేవి. మొదట చిన్నారెడ్డిని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి… చివరి నిమిషంలో మేఘారెడ్డికి మార్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అంతా సైలెంట్‌గా ఉన్నప్పటికీ అనంతర పరిణామాలతో ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత కార్యక్రమం ఏదైనా ఇరువురు నేతలు, అనుచరులు ఎడ మొహం పెడ మొహంగానే ఉంటున్నట్లు చెబుతున్నారు.

కేవలం 8 నెలల వ్యవధిలోనే ఇద్దరు ప్రధాన నేతలు రచ్చకు దిగడంపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఐనప్పటికీ ఇద్దరూ వెనక్కి తగ్గలేదని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ మొండిగా వ్యవహరిస్తుండటం వల్ల పార్టీలో సమన్వయం కొరవడుతోంది. దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఐతే కాంగ్రెస్‌లో ఈ పరిస్థితిని క్యాష్‌ చేసుకోవాలని ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఐతే ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉండటం వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చని… మున్ముందు ఇదే అంశం పార్టీలో పెద్ద అగాధం సృష్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం

ట్రెండింగ్ వార్తలు