Telangana Govt : తెలంగాణలోని వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఇబ్బందులకు చెక్.. కొత్త విధానం అమల్లోకి.. ఫుల్ డీటెయిల్ ఇలా..
Telangana Govt vehicle registration : తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల సమర్పణను పూర్తిగా ఆన్లైన్ విధానంను అమలు చేయాలని నిర్ణయించింది.
vehicle registration
- తెలంగాణలో వాహనదారులకు గుడ్‌న్యూస్
- వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు ఇక ఆన్లైన్లోనే
- నేటి నుంచి అమల్లోకి.. రవాణా శాఖ కీలక నిర్ణయం ఉత్తర్వులు జారీ
Telangana Govt vehicle registration : తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని రోజురోజుకు అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రవాణాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల సమర్పణను పూర్తిగా ఆన్లైన్ విధానంను అమలు చేయాలని నిర్ణయించింది.
గతంలో కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. కార్లు, టూవీలర్ల వంటి వాహనాల టెంపరరీ రిజిస్ట్రేషన్లు షోరూములలోనూ, శాశ్వత రిజిస్ట్రేషన్లు రవాణాశాఖ కార్యాలయాల్లో జరిగేవి.. ఈ క్రమంలో పలు ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు అనేక విధాలుగా కొర్రీలు పెట్టి తిరస్కరించేవారు. దీంతో ఏజెంట్లు ద్వారా పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇటీవల కాలంలో వాహనదారుల ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్లు, టూవీలర్ల శాశ్వత రిజిస్ట్రేషన్లు షోరూముల్లోనే చేయాలన్న కొత్త విధానాన్ని రవాణా శాఖ అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విధానంలో వాహనదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనానికి సంబంధించిని ఫిజికల్ ఫారం-20ని డీలర్లు తీసుకెళ్లి ఆర్టీవో కార్యాలయాల్లో ఇవ్వడం, వాహన కొనుగోలుదారుడి ఫొటో అప్లోడ్ వంటి అనేక సమస్యల కారణంగా కొన్ని చోట్ల మూడు నుంచి నాలుగు వారాలకు కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలకు చెక్ పెడుతూ రవాణా శాఖ అధికారులు సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పణను పూర్తిగా ఆన్లైన్ విధానంలో అమలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన ఏడు రోజుల్లోగా డీలర్ పత్రాలను రవాణాశాఖకు అప్లోడ్ చేయాలని, ఆలస్యం చేస్తే వాహన డీలర్ల లాగిన్‌ను సస్పెండ్ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.
అయితే, కొత్త విధానం ద్వారా.. ఇకనుంచి డీలర్లు వాహన యాజమాని, ఫైనాన్షియర్ సంతకాలతో స్కాన్ చేసిన ఫారం-20తో పాటు అవసరమైన ఇతర పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. డీలర్ నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను రెండు రోజుల్లో అంటే రెండు పని దినాల్లో పరిశీలించి ఆమోదించాలి. లేదా సవరణల కోసం తిప్పిపంపాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం మార్చి 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విధానం ద్వారా వాహన రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న ఆలస్యానికి చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
