27 లేక 32.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతం చేసిన ప్రభుత్వం

  • Publish Date - November 12, 2020 / 05:45 PM IST

ap new districts: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోతుందని భావించారు. కాకపోతే ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతమైందని అంటున్నారు. కాకపోతే కొత్త జిల్లాల సంఖ్యపైనే ఇప్పుడు వివాదం మొదలైంది. మంత్రివర్గ సమావేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అరకు మాత్రం రెండు జిల్లాలుగా చేయాలని, వీటితో కలిపి జిల్లాల సంఖ్య 27 అవుతుందని చెప్పుకొచ్చింది.

కొత్త జిల్లాల సంఖ్య 32?
తాజాగా కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయట. రాష్ట్రంలో కొత్త జిల్లాల సంఖ్య 32గా ఉంటుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాల పెంపును అధికార పార్టీ నేతలు స్వాగతిస్తూనే తమ ప్రాంతాల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలను.. వాటి పేర్లను ఖరారు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారట. టీడీపీలోని కొందరు ముఖ్యులు, అధికార పార్టీలోని సీనియర్లు సైతం జిల్లాల పెంపును వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామన్న జగన్:
తాము అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని నాడు విపక్ష నేతగా ఉన్న నేటి సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశంతో పాటుగా కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. దీనిపైన కేబినెట్‌లో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 25 లోక్‌సభ నియోజకవర్గాలతో 25 జిల్లాలు.. 5 జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు లోక్‌సభ ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా విభజించాలని ఓ నిర్ణయానికి వచ్చింది సర్కారు.

వచ్చే ఉగాదిలోగా కొత్త జిల్లాల ఏర్పాటు:
సాధ్యాసాధ్యాల పరిశీలన, సూచనల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే ఉగాదిలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే, తాజాగా ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య 32గా ఉంటుందనే ప్రచారం మొదలైంది. ప్రభుత్వం దీనిని అధికారికంగా చెప్పకపోయినా కొత్త జిల్లాలు, అందులో ఉండే నియోజకవర్గాల పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాదనను కొందరు సమర్ధిస్తుంటే.. మరి కొందరు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

ప్రజల ఆస్తులకు విలువ పెరిగి ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడుతుందని అంచనా:
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పదిగా ఉన్న జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. జిల్లాల సంఖ్య పెంపు ద్వారా పాలనా సౌలభ్యం పెరగటం, ప్రజలకు ప్రభుత్వ అధికారులు, కార్యాలయాలు చేరువ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితులను సైతం పరిగణలోకి తీసుకొని, ఖర్చు భారం పెద్దగా లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. జిల్లాల సంఖ్య పెరగటం ద్వారా ప్రజల ఆస్తులకు ఎక్కడికక్కడ విలువ పెరిగి ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలు, ప్రభుత్వం మధ్య మరింత దగ్గరి సంబంధాలు:
పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలు, ప్రభుత్వం మధ్య మరింత దగ్గరి సంబంధాలు ఏర్పడతాయని ప్రభుత్వంలోని ముఖ్యులు వాదిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాల విభజనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జిల్లాల విభజనపై వైసీపీ సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. పార్లమెంట్ యూనిట్‌గా జిల్లాను విభజిస్తే రాజకీయంగా నష్టపోతామని శ్రీకాకుళానికి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఓపెన్‌గానే చెబుతున్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ సైతం రాజకీయ లాభం కోసం చేస్తున్న జిల్లాల విభజనను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఇక, హద్దులు, పేర్ల విషయంలో వివాదాలు తప్పేలా లేవని అంటున్నారు.

ప్రజల సెంటిమెంట్లను గుర్తించి వారి కోరిక మేరకు జిల్లాల ఏర్పాటు:
అధికార పార్టీలోని మంత్రులు, నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల సెంటిమెంట్లను గుర్తించి, వారి కోరిక మేరకు జిల్లాల ఏర్పాటు, పేర్ల ఖరారు కోసం ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు, కృష్ణా జిల్లాలోని బందరు, తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు పేర్ల విషయంలో అప్పుడే కొత్త డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. రాజమండ్రి పార్లమెంటును గోదావరి జిల్లాగా ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరామని మంత్రి తానేటి వనిత చెబుతున్నారు. తూర్పుగోదావరిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి గోదావరి జిల్లా ఏర్పాటు చేయాలని సూచించారు.


ఎన్ని జిల్లాలు? ఎప్పటి నుంచి అధికారికంగా ఏర్పాటవుతాయి?
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉనికి పోకుండా జిల్లా పేరు పెడితే బాగుంటుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అంటున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అవి ఎప్పటి నుంచి అధికారికంగా ఏర్పాటవుతాయి? ఎన్ని జిల్లాలనేది ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ కీలక నేతలు అంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆలోచనలపై స్పష్టత వచ్చిన తర్వాత దీనిపైన రాజకీయ స్పందనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ తతంగమంతా సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు