దేశంలో నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇవాళ ముగిసింది. మొత్తం 96 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 13న జరిగే నాలుగో దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో (96 లోక్‌సభ స్థానాలకు) ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ (25 లోక్‌సభ స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకశ్మీర్ (1) స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలోని అసెంబ్లీ కంటోన్మెంట్ ఎన్నిక కూడా మే 13నే జరుగుతుంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల ప్రచార హడావిడి తగ్గింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించారు నేతలు.
ఏపీ, తెలంగాణలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 5 లోక్‌సభ నియోజక వర్గాల్లోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథనితో పాటు మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం 4 గంటలకే ముగిసింది.
144 సెక్షన్ అమలు
ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు అవుతుంది. నలుగురి కంటే అధికంగా వ్యక్తులు గుంపుగా తిరగవద్దు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి ప్రచారం చేయొద్దు. జూన్ 1వ తేది వరకు సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ ఉంది.
మూతపడ్డ మద్యం దుకాణాలు
ఎన్నికలు జరగనున్న నియోజక వర్గాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటలు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఈ రోజు సాయంత్రం మూడున్నర నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ చేయించారు ప్రభుత్వ అధికారులు. ఎన్నికలు ముగిసిన తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.
Also Read: ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది: ప్రియాంక గాంధీ