Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరుపోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

ఎన్నికలు సమీపిస్తుండటం.. తాము ఇంకా రేసులోనే ఉన్నామని చెప్పేందుకే గల్లా కుటుంబం అరుణకుమారి పుట్టినరోజున హంగామా చేసిందని అంటున్నారు.

Galla Aruna Kumari to contest next elections

Galla Family Politics: ఏడు దశాబ్దాల రాజకీయ అనుభవం.. మూడు తరాల రాజకీయ వారసత్వం.. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఘన విజయాలు.. వేలాది కార్మికులు.. లక్షలాది అభిమానులు ఇలా ఎందరో మద్దతు ఆ కుటుంబం సొంతం.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులను అధిష్టించిన ఆ కుటుంబ సభ్యులు.. ఎందుకో సడన్‌గా రాజకీయాలు (AP Politics) వద్దనుకున్నారు. తమ వ్యాపారాలు.. తమపై ఆధారపడిన కార్మికులే ముఖ్యం అనుకున్నారు. మళ్లీ ఏమైందో గాని ఇప్పుడు రాజకీయాల నుంచి విరామమే కాని విశ్రాంతి కాదనే సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి.. టీడీపీలో చక్రం తిప్పుతున్న గల్లా కుటుంబం కోసమే ఇదంతా.. కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న గల్లా కుటుంబ సభ్యులు మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? వారిని మళ్లీ రాజకీయాల్లోకి లాగుతున్నదెవరు?

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గల్లా కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ (Galla Jayadev) కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ ఐనా.. అటు వైపు చూడటం లేదు జయదేవ్. టీడీపీలో యాక్టివ్ లీడర్ అయిన జయదేవ్ స్వతహాగా పారిశ్రామిక వేత్త. ఆయన కుటుంబ యాజమాన్యంలోనే చిత్తూరు జిల్లాలో అమరరాజా బ్యాటరీస్ కంపెనీ నడుస్తోంది. ఈ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమతో కాలుష్యం పెరిగిపోతోందని నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జయదేవ్ టీడీపీలో ఉండటంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇక ఆ తర్వాత నుంచి గల్లా జయదేవ్ రాజకీయాల్లో జోరు తగ్గించారు. ప్రభుత్వ వైఖరి వల్లో.. పరిశ్రమ విస్తరణలో బిజీగా ఉండటం వల్లనో గాని ఇంతకు ముందు కనిపించిన దూకుడు ఇప్పుడు ఎక్కడా చూపడంలేదు జయదేవ్.

ఇక జయదేవ్ తాత రాజగోపాలనాయుడు చిత్తూరు ఎంపీగా రెండుసార్లు పనిచేశారు. అంతకుముందు తపనంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జయదేవ్ తల్లి అరుణకుమారి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరితోపాటు పూతలపట్టు, నగిరి, తిరుపతి.. ఇలా నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సామర్థ్యం గల్లా కుటుంబానికి ఉంది. ఐతే తండ్రి రామచంద్రానాయుడు నుంచి అమరరాజా చైర్మన్ బాధ్యతలు తీసుకున్న జయదేవ్ రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారనే కారణంతో కొద్దికాలం విరామం ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూడా గుంటూరుకు ప్రత్యామ్నాయ అభ్యర్థిని అన్వేషిస్తోంది.

Also Read: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

రాజకీయాల్లో గల్లా కుటంబ ప్రస్తానం చరిత్రగా చెప్పుకుంటున్న సమయంలో మాజీ మంత్రి అరుణ మళ్లీ యాక్టివ్‌ అవ్వడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. చంద్రగిరిలో నాలుగు సార్లు గెలిచిన అరుణకుమారి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పోటీకి దూరంగా ఉండిపోయారు. వచ్చే ఎన్నికల్లో అరుణకుమారి కూతురు రమాదేవిని పోటీ చేయించాలని తొలుత భావించారు. ఏమైందో కాని ఆ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. ఐతే ఇప్పుడు మళ్లీ అరుణకుమారి తెరపైకి వస్తున్నారు. కొద్దికాలంగా తిరుపతిలో కనిపించని అరుణకుమారి పుట్టినరోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం.. తాము ఇంకా రేసులోనే ఉన్నామని చెప్పేందుకే గల్లా కుటుంబం అరుణకుమారి పుట్టినరోజున హంగామా చేసిందని అంటున్నారు. గల్లా కుటుంబం తరుఫున ఎవరుపోటీ చేసినా టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉంది. ఐతే ఎవరు పోటీ చేస్తారన్నదే క్లారిటీ ఇవ్వకపోవడంతో టీడీపీ అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇదే సమయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పులపర్తి నానిని ఇప్పటికే ప్రకటించారు. మళ్లీ అరుణ పోటీ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: తిరుపతి బరిలో వైసీపీ కొత్త అభ్యర్థి.. తెరపైకి డాక్టర్ శిరీష పేరు!?

రాజకీయ ప్రాధాన్యంతోపాటు పారిశ్రామిక నేపథ్యం వల్ల కార్మికుల్లో గల్లా కుటుంబంపై అభిమానం ఉంది. అదేసమయంలో సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడైన జయదేవ్‌కు హీరో మహేశ్‌బాబు అభిమానుల అండదండలు ఉన్నాయి. అన్నిరకాల బలగం ఉన్న గల్లా కుటుంబం రాజకీయ ప్రస్థానంలో విశ్రాంతి కోరుకోవడంపై అనేక రకాల చర్చ జరిగింది. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అవుతుండటంతో విశ్రాంతి కాదు విరామమే అంటున్నారు పరిశీలకులు. ఇందులో ఏది నిజమో.. గల్లా కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో..? అన్న సస్పెన్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు