ఊళ్లకు ఊళ్లని చుట్టేసిన వరద.. ముంపు ప్రాంతాల్లో కన్నీళ్లు మిగిల్చిన పెద్దవాగు

వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది.

Peddavagu Breach : పెద్ద వాగు గండి ఊళ్లను ముంచేసింది. చెట్టుకొకరు, పుట్టకొకరయ్యారు వరద బాధితులు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ముంపు ప్రాంతాల్లో కన్నీళ్లు మిగిల్చింది పెద్దవాగు. తెలంగాణలోని 4 గ్రామాలు, ఏపీలోని 16 గ్రామాలు ముంపులో మునిగాయి. వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది. తెలంగాణలో 512 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పెద్దవాగు ప్రాజెక్ట్ కింద.. తెలంగాణలో 2వేల ఎకరాలు, ఏపీలో 14వేల ఎకరాలు సాగు అవుతున్నాయి. అయితే, గత పదేళ్లుగా పెదవాగు ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి మరమ్మతులు జరగలేదు. 40వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పెద్దవాగు ప్రాజెక్ట్ కు 70వేల క్యూసెక్కుల వరద ఒకేసారి వచ్చింది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే సిబ్బంది, ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు, ఇంజినీర్లు ఎవరూ అక్కడ లేరు. వర్షం ఎక్కువగా వస్తోంది, గోదావరి వరద ఎక్కువగా ఉందని, పెద్దవాగు ప్రాజెక్ట్ వరదతో నిండిందని రైతులు చెబుతున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కసారిగా 70వేల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. మొత్తం మూడు చోట్ల గండి పడింది. 20వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఇసుక మేటలు వేసింది. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, పశువులు, ఇళ్లు పెద్ద ఎత్తు కొట్టుకుపోయాయి.

పెద్దవాగు ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలను ఏపీ మంత్రి పార్థసారథి, తెలంగాణ మంత్రి తుమ్మల పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ పెద్దవాగు ప్రాజెక్ట్ కు సంబంధించిన గండి పూడ్చివేత, ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచే ఆధునికీకరణ, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నాయి.

రైతులను ఆదుకుంటామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. శాశ్వతమైన పరిష్కారానికి ఇరు ప్రభుత్వాలు చర్చించాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు.

ఏపీలోని ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆ ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : 2 రోజులు భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు

ట్రెండింగ్ వార్తలు