Rain Alert : రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ జిల్లాల్లో వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక సూచనలు
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
AP Rains
- బంగాళాఖాతంలో ఆవర్తనం
- ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
- రెండు రోజులు వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల తరువాత బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్టణం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని, ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడవడంతో ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ఈనెల 16వ తేదీ తరువాత ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో హోర్డింగ్ ల వద్ద, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద వేచిఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈదురు గాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో ఉదయం 9గంటల తరువాత బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు భయపడుతున్నారు. మరోవైపు ఎండలకుతోడు ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే ఉపశమనం కలిగినట్లే. కానీ, ప్రస్తుతం ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు సాగుచేసిన పంటలు చేతికొందే సమయం ఇది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
