CM Revanth Reddy : కాలేజీలకు వెళ్లే విద్యార్థినీలకు గుడ్న్యూస్.. ఉచితంగా ఈవీ స్కూటీలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
CM Revanth Reddy
- అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాద్లో డిసెంబర్ నాటికి 100శాతం ఈవీ బస్సులు
- కాలేజీ విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇస్తామని వెల్లడి
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్న రేవంత్.. త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు.. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో మహిళ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు..
హైదరాబాద్లో వంద శాతం ఈవీ బస్సులు..
హైదరాబాద్కు కాలుష్యమే అతి పెద్ద సమస్యగా మారిందని, హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కాలుష్యం నివారించే బాధ్యత మనందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీడేలా తీర్చిదిద్దాలని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పరిశ్రమలను తరలించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్ నాటికి జిల్లాలకు తరలిస్తామని, హైదరాబాద్ లో వందశాతం ఈవీ బస్సులను తెస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు.. హైదరాబాద్ ఏసీ ఈవీ బస్సులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
