బోనమెత్తిన సజ్జనార్ భార్య.. ఉజ్జయిని అమ్మవారి సేవలో..
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్(Cp Sajjanar), ఐపీఎస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
hyderabad cp sajjanar participated in ujjaini mahankali bonalu with family
- అమ్మవారి సేవలో సీపీ సజ్జనర్
- తొలిసారి ఏఐ ఆధారిత నిఘా
- రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు
Cp Sajjanar: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు భాగ్యనగరంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ జరుగుతున్నాయి. ఈ చారిత్రక వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్(Cp Sajjanar), ఐపీఎస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ ప్రాంగణంలో హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గోల్కొండ, బల్కంపేట జాతరలు ప్రశాంతంగా ముగిశాయని, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ ఉత్సవాలను కూడా విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
బోనాల ఉత్సవాల్లో తొలిసారిగా ఏఐ సాంకేతికతతో క్రౌడ్ మేనేజ్మెంట్:
భక్తుల రక్షణే ధ్యేయంగా సుమారు 2,500 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు బోనాల చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ప్రవేశపెట్టారు. సీసీటీవీ కెమెరాలకు ‘ఫేషియల్ రికగ్నిషన్’ సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించే అవకాశం ఏర్పడింది. క్యూలైన్లలో భక్తుల లెక్కింపుతో పాటు ఆలయంలో రద్దీ సాంద్రతను ‘థ్రెషోల్డ్ మ్యాపింగ్’ ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రశాంత వాతావరణంలో దర్శనాలు:
దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలతో పూర్తిస్థాయి సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు సీపీ సజ్జనర్ స్పష్టం చేశారు. భక్తులందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ, జాతరను జయప్రదం చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ట్రాఫిక్-1 డీసీపీ అవినాశ్ కుమార్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
