Lashkar Bonalu: ఘనంగా ‘లష్కర్ బోనాలు’ ప్రారంభం.. ఉజ్జయిని మహంకాళికి ‘తొలి బోనం’ సమర్పించిన మంత్రి.. పోటెత్తిన భక్తజనం
సికింద్రాబాద్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల(Lashkar Bonalu) ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
secunderabad lashkar bonalu ujjaini mahankali temple traffic advisory
- లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా
- అమ్మవారికి తొలి బోనం సమర్పణ
- సికింద్రాబాద్‌లో కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలు
Lashkar Bonalu: సికింద్రాబాద్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల(Lashkar Bonalu) ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించేందుకు భక్తజనం పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.
భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు – బారీ పోలీస్ బందోబస్తు:
భక్తుల రద్దీని తట్టుకునేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సాధారణ దర్శనాల కోసం మూడు, బోనాలు సమర్పించే వారి కోసం రెండు, వీఐపీల కోసం మరొక ప్రత్యేక క్యూలైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం బోనాల సమర్పణ జరగగా, సోమవారం నాడు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే రంగం భవిష్యవాణి, అంబారీపై అమ్మవారి భవ్య ఊరేగింపు నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు – ప్రత్యామ్నాయ మార్గాలు:
లష్కర్ బోనాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. మహంకాళి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులైన పొగాకుబజార్, సుభాష్‌రోడ్, హిల్‌స్ట్రీట్, జనరల్‌బజార్ మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, సాధారణ వాహనాలను కర్బాలా మైదాన్, రాణిగంజ్ క్రాస్‌రోడ్స్, మినిస్టర్ రోడ్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.
