Aadhaar-Voter ID : కేంద్రం సంచలనం.. ఆధార్ కార్డు కాదు.. ఇక నుంచి ఓటర్ ఐడీతో లింక్.. అబ్ ఆయేగా మజా..!
Aadhaar Replaced Voter ID : లబ్ధిదారుల గుర్తింపు, వారికి నగదు చెల్లింపుల కోసం ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ (EPIC నంబర్), బయోమెట్రిక్ వివరాలను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Aadhaar Replaced By Voter Id Government Benefits
Aadhaar Replaced Voter ID : ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుందా..? ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రధాన గుర్తింపుగా ఉన్న ఆధార్ కార్డుకు బదులుగా ఓటర్ ఐడీని వినియోగించనున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
లబ్ధిదారుల గుర్తింపు, వారికి నగదు చెల్లింపుల కోసం ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ (EPIC నంబర్), బయోమెట్రిక్ వివరాలను ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఢిల్లీలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన నేషనల్ వర్క్‌షాప్ ఆన్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు చెల్లింపులు చేయడానికి ఇకపై ఆధార్ కార్డు ప్రాతిపదికగా ఉండబోదని స్పష్టం చేశారు.
ఆధార్ కార్డులు జారీ చేసే కేంద్రాలు ప్రస్తుతం ప్రతిచోటా అందుబాటులో ఉన్నాయని, ఎవరికి కావాలంటే వారికి కొద్ది నిమిషాల్లోనే ఆధార్ కార్డు పొందే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపునకు బయోమెట్రిక్ వివరాలతో పాటు ఓటర్ ఐడీకి సంబంధించిన EPIC నంబర్‌ను ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. ఈ వివరాల ఆధారంగానే భవిష్యత్తులో చెల్లింపులు జరగనున్నట్లు వెల్లడించారు.
ఏయే పథకాలపై ప్రభావం పడనుంది..?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), జాతీయ సామాజిక భద్రతా కార్యక్రమం కింద వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల చెల్లింపుల్లో ఆధార్ కీలకంగా ఉంది. అయితే ఈ పథకాలన్నింటికీ కొత్త విధానం వర్తిస్తుందా..? లేక కొన్ని నిర్దిష్ట పథకాలకే పరిమితం చేస్తారా..? అనే అంశంపై మంత్రి స్పష్టత ఇవ్వలేదు. కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఈ మార్పునకు సంబంధించి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం లేదు.
కొత్త ప్రతిపాదనపై రాజకీయ దుమారం..
మరోవైపు, ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీని తప్పనిసరి చేస్తే పేదలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని సీపీఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే బయోమెట్రిక్ ధ్రువీకరణలో వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం, వృద్ధుల ఐరిస్ స్కానింగ్ విఫలమవడం వంటి సమస్యలతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ముఖ్యంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఓటర్ ఐడీని సంక్షేమ పథకాల లబ్ధికి తప్పనిసరి చేయడం మరింత మందిని పథకాలకు దూరం చేసే అవకాశం ఉందని విమర్శించింది. దీంతో కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ మార్పు అమల్లోకి వస్తే ఎవరెవరిపై ప్రభావం పడుతుంది? ఏయే పథకాలకు వర్తిస్తుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
