TTD: తిరుమల కొండంతా సమస్యలు.. ప్రక్షాళనకు ఏం చేస్తున్నారో తెలుసా?

ఒకే ఆధార్‌ నెంబర్‌తో వందల కొద్దీ బుకింగ్స్‌, ఫేక్‌ ఆధార్‌ కార్డులతో చేస్తున్న బుకింగ్‌లపైనా టీటీడీ ముమ్మరంగా..

TTD

తిరుమల కొండపై భక్తుల సమస్యలు, దర్శనం నుంచి వసతి ఇతర సౌకర్యాల విషయంలో కొండ పవిత్రతను కాపాడేలా ప్రక్షాళన మొదలు పెట్టామని టీటీడీ చెబుతోంది. ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు గత నెలరోజులుగా దీనికోసం ముమ్మరంగా కసరత్తు చేసినట్లు చెప్పారు. వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేస్తామంటున్నారు. భక్తులు తిరుమల యాత్రను అత్యంత సౌకర్యవంతంగా చేసుకునేలా మార్పులు చేర్పులు చేయబోతున్నామని టీటీడీ చెబుతోంది. కొండ ప్రక్షాళనకు టీటీడీ భారీ ప్రణాళికల్నే రచించింది.

సామాన్య భక్తుల సేవలో తరించేలా తిరుమలలో ప్రక్షాళన చేస్తున్నామని చెబుతోంది టీటీడీ. నూతన టీటీడీ ఈవో శ్యామలరావు నెలరోజులుగా దీనిపై తనిఖీలు, క్షుణ్ణమైన పరిశీలన చేసినట్లు చెబుతున్నారు. వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిదిద్ది.. తిరుమల యాత్ర అంటే భక్తులకు కలకాలం గుర్తుండే మధురమైన అనుభూతులను పంచేలా చేస్తామంటున్నారు. దానికి కావాల్సిన యాక్షన్‌ప్లాన్‌ను ఇప్పటికే రెడీ చేసినట్లు చెబుతున్నారు.

క్యూలైన్లలో ఇబ్బందులు
తిరుమలకు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో ఎంతో మంది భక్తులు వస్తుంటారు. సామాన్య భక్తులు సర్వదర్శనం కోసం క్యూలైన్లలో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముంది. పిల్లలకు పాలు, ఆహారంతో పాటు ఇతర భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు టీటీడీ ఈవో.

గతంలో చాలామంది క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం అందేది కాదని.. దీనికోసం కొత్తగా మూడు ఆహార వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు పర్యవేక్షించేలా మూడు షిఫ్టుల్లో ఏఈవోల వ్యవస్థను ఏర్పాటు చేసింది టీటీడీ. నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లలో వీరి పర్యవేక్షణ ఉంటుంది. భక్తులకు ఆహారం సరిగా అందుతోందా..? సిబ్బందితో ఏమైనా సమస్యలున్నాయా.. ఇలా అన్ని అంశాలు వీరు చూసుకునేలా ఏఈవోల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీకెండ్స్‌లో భక్తుల రద్దీకి , వేచి ఉండేలా ప్రత్యేకమైన వెయిటింగ్‌ హాళ్లను కూడా నారాయణగిరి దగ్గర అందుబాటులోకి తేనుంది టీటీడీ.

నాణ్యతపై దృష్టి
తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను కాపాడటమే కాకుండా.. నాణ్యతతో కూడిన అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని నూతన ఈవో శ్యామల రావు చెబుతున్నారు. తిరుమల అన్నప్రసాదం క్యాంటీన్‌లో నిత్యం వేలాదిమంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తుంటారు. అన్నపదార్థాల క్వాలిటీపై ఫిర్యాదుల కారణంగా అన్నం నాణ్యత, కూరల రుచిపై అక్కడ కూడా క్వాలిటీ చెకింగ్‌ అధికారుల పర్యవేక్షణ పెంచుతున్నారు.

ఇప్పటికే పలు ఫుడ్‌, క్యాటరింగ్‌ నిపుణులతో టీటీడీ ఈవో శ్యామలరావు అన్నప్రసాదం క్యాంటీన్‌లో తనిఖీలు చేశారు. సరుకులు నాణ్యమైనవి వాడటం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కిచెన్‌లో పనిచేసే వారి సంఖ్య పెంచడం దగ్గర్నుంచి.. కుకింగ్‌ సామాగ్రిని అప్‌గ్రేడ్‌ చేయబోతున్నామన్నారు. అంతే కాకుండా.. సరుకులు క్వాలిటీవి వచ్చేలా సప్లై చేసే వారికి వార్నింగ్‌ ఇచ్చింది టీటీడీ.

తిరుమల లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా లడ్డూ నాణ్యతపై భక్తులు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించామన్నారు. దీంతో క్వాలిటీ లడ్డూ ప్రసాదాన్ని అందించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామంటోంది టీటీడీ. నెయ్యి నాణ్యత పెంచడంతో పాటు.. లడ్డూకు వాడే పిండి, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రవ్వ ఇలా ప్రతి వస్తువు అత్యంత నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

సరుకుల కొనుగోళ్ల నుంచే వాటి నాణ్యతను చెక్‌ చేసేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంటున్నారు. వారి భాగస్వామ్యంతో తిరుమలలో ఒక మంచి క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. బియ్యం, బెల్లం, చక్కెర, పప్పు ఇలా ఏ వస్తువైనా ఈ ల్యాబ్‌ ఆమోదించిన తర్వాతే తీసుకునేలా చర్యలు చేపడుతోంది టీటీడీ.

తిరుమలలో టీటీడీ అన్నప్రసాద కేంద్రాలే కాదు.. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే అవుట్‌సైడ్‌ దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణపైనా టీటీడీ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరుపతిలో కంటే తిరుమలలో రేట్ల మోత అధికంగా ఉంటుందని సామాన్య భక్తుల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదు. దీన్ని నియంత్రించడంతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహించే దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యత, పరిశుభ్రత, కొండ పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ భరోసా ఇస్తోంది.

హోటళ్ల లైసెన్సులు రద్దు?
కొందరు లైసెన్స్‌లను ఒక పేరుపైన తీసుకుని మరో వ్యాపారం చేస్తున్నారని.. కొన్ని రెస్టారెంట్లలో కుళ్లిన ఆహార పదార్థాలు, చెడిపోయిన సామాగ్రిన టీటీడీ ఈవో చేసిన తనిఖీల్లో బయటపడింది. అలాంటి హోటళ్ల లైసెన్సులు రద్దు కూడా చేసినట్లు చెబుతున్నారు. రేట్ల విషయంలోనూ, క్వాలిటీ లోనూ నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.

తిరుమలలో తిష్టవేసిన దళారీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని టీటీడీ చెబుతోంది. వసతి, దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల పేరుతో ఆన్‌లైన్‌లో అటు టీటీడీని, ఇటు భక్తులను మోసగిస్తున్నవారి ఆటకట్టేలా సరికొత్త టెక్నాలజీ వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వారి ఈమెయిల్‌ ఐడీలు, మొబైల్ నెంబర్లు గుర్తించామని.. వాటిని బ్లాక్‌ చేసేశామన్నారు.

ఒకే ఆధార్‌ నెంబర్‌తో వందల కొద్దీ బుకింగ్స్‌, ఫేక్‌ ఆధార్‌ కార్డులతో చేస్తున్న బుకింగ్‌లపైనా టీటీడీ ముమ్మరంగా నిఘా పెట్టింది. అలా మోసం చేసే వారి ఆట కట్టిస్తామంటోంది. మోసాన్ని ఈజీగా గుర్తించేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీల సాయం తీసుకుని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని టీటీడీ సామాన్య భక్తులకు హామీ ఇస్తోంది.

Also Read: ఎందుకిలా చేశారో అందరికీ తెలుసు: అంబటి రాంబాబు

ట్రెండింగ్ వార్తలు