ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతాం- విజయసాయిరెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్ ఏర్పాటు చేయాలి.

Vijayasai Reddy : ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆయన ఆరోపించారు. వైసీపీ వాళ్లపై దాడు చేయడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీలో శాంతి భద్రతలు, ప్రభుత్వ వైఫల్యాలు, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను వైసీపీ లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధుల వాటా పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. రాష్ట్రాల నిధుల వాటా విషయంలో జనాభా నియంత్రణ చేస్తున్న రాష్ట్రాలు నష్టపోతున్నాయని, జనాభా నియంత్రించని రాష్ట్రాలు లాభ పడుతున్నాయని పేర్కొన్నారు.

”కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్ ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. గడిచిన ఐదేళ్లుగా మమ్మల్ని సౌత్ కోస్టల్ రైల్వే జోన్ గురించి భూమి ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి. యూపీఎస్సీ వ్యవస్థను బలపరచాలి.

ఏపీలో శాంతి భద్రతలు లేవు. దీనిపై అఖిలపక్షంలో వివరించాం. 490 ప్రభుత్వ, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. 45 రోజుల్లో 31 రాజకీయ హత్యలు జరిగాయి. 300 హత్యాయత్న ప్రయత్నాలు జరిగాయి. ఏపీలో బ్లాక్ మెయిల్ జర్నలిజం నడుస్తోంది. లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డిపై దాడి జరిగింది. వైసీపీ నేతలపై దాడులు చేస్తూ వారిపైనే కేసులు పెడుతున్నారు. ఏపీలో ప్రజా పాలనకు టీడీపీకి అర్హత లేదు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. జగన్ మంగళవారం ఢిల్లీ వస్తున్నారు. బుధవారం ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ఫోటో ఎగ్జిబిషన్, ధర్నా ఉంటుంది. జాతీయ మీడియాను ఉద్దేశించి జగన్ మాట్లాడతారు. ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరాం. ఎంతవరకు సమయం ఇస్తారో తెలీదు. అంశాల వారిగా కేంద్రానికి వైసీపీ మద్దతు ఉంటుంది.

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడింది. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ అడగలేదు. ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము పోరాడతాం. గడిచిన పదేళ్లుగా ప్రత్యేక హోదా అడిగాం” అని వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి అన్నారు.

”ఏపీలో భయానక దాడులు జరుగుతున్నాయి. ఎంపీగా నియోజకవర్గానికి వెళ్తే దాడులు చేస్తున్నారు. దాడులు చేయడమే కాదు తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. రషీద్ ది రాజకీయ హత్య. ఏపీలోని పరిస్థితులను అన్ని పార్టీల దృష్టికి జగన్ తీసుకెళ్తారు. నాపై దాడి విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళతాం” అని వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు.

Also Read : మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ- గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు