TDP: బెజవాడ బ్యాచ్‌పై చంద్రబాబు అసంతృప్తి.. యువగళం పాదయాత్ర కుదింపు.. రగిలిపోతోన్న లోకేశ్!

రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభలతో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నా బెజవాడ వేదికగా ఒక్క కార్యక్రమం చేయలేకపోతున్నామని అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు.

Bezawada TDP Leaders

Bezawada TDP: బెజవాడ బ్యాచ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కోపంగా ఉన్నారట? పేపర్లు.. టీవీల్లో పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చే బడా నేతలు.. పార్టీకి అవసరమైనప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారట. పేరుకే పెద్ద పెద్ద లీడర్లని.. పనితనం మాత్రం చాలా హీనమని అధినేత బాబుతోపాటు యువనేత లోకేశ్ (Nara Lokesh) రగిలిపోతోన్నట్లు తాజా సమాచారం. కీలకమైన కృష్ణా జిల్లాల్లో (krishna district) లీడర్ల వైఖరి కారణంగా ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నామని.. చివరికి లోకేశ్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కూడా కుదించుకోవాల్సివచ్చిందని టీడీపీ బాస్ అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత?

కృష్ణా జిల్లా ఒకప్పుడు టీడీపీకి అడ్డా.. ఇక బెజవాడలోనూ టీడీపీకి స్ర్టాంగ్ క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎదురుగాలి వీచినా.. విజయవాడ (Vijayawada) ఎంపీ స్థానం నిలబెట్టుకుంది టీడీపీ. అంతేకాదు పేరుకే అమరావతి రాజధాని అయినా.. పార్టీ వ్యవహారాలన్నీ విజయవాడ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఇంతటి కీలకమైన జిల్లాలో ముఖ్య నాయకుల తీరు అధినేత చంద్రబాబుకు రుచించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇలా ముఖ్య నాయకులు అంతా విజయవాడ వాసులే.. అంతేకాదు పార్టీ వాదనను బలంగా వినిపించే విషయంలోనూ వీరే ముందుంటారు. కానీ, అధినేత చంద్రబాబు మాత్రం వీరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

Also Read: పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ.. అమ్మాయి ఎవరంటే..

పత్రికా ప్రకటనలు.. టీవీ చర్చల్లో కనిపించే ఈ నేతలు క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభలతో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న.. బెజవాడ వేదికగా ఒక్క కార్యక్రమం చేయలేకపోతున్నామని అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు. అంతేకాదు ముఖ్యనేతలుగా చలామణి అవుతున్న వారు సహకరించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రను కూడా కృష్ణా జిల్లాలో సరిగా చేపట్టలేకపోతున్నామని చెబుతున్నారు టీడీపీ నాయకులు. ఈ నెల 19న గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు లోకేశ్. ముందుగా 15 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో లోకేశ్ యువగళం సభ నిర్వహించాలని అనుకున్నారు. ఐతే బెజవాడ బ్యాచ్ వైఖరి కారణంగా కేవలం ఐదు రోజులకే పరిమితం చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు లోకేశ్ యాత్ర మొత్తం ప్రతినియోజకవర్గంలోనూ ఒక సభ నిర్వహించగా.. కృష్ణా జిల్లాలో మాత్రం ఒక్క గన్నవరం సభతోనే సరిపెడుతున్నారని టాక్ నడుస్తోంది.

Also Read: కోనసీమ వైసీపీలో కుంపటి.. పినిపే విశ్వరూప్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు

అంతేకాదు బెజవాడలో బడా నేతలు పనితనంపై నమ్మకం లేక.. పార్టీ కార్యక్రమాల్లో కొత్తగా తిరుగుతున్న కేశినేని చిన్నిపై భారం వేశారట చంద్రబాబు. విజయవాడ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న చిన్ని సైతం.. తన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారట.. ఎంపీ కేశినేని నానితో చిన్నికి విభేదాలు ఉన్నా.. బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడంతో ఆయన్నే ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారట చంద్రబాబు.. కీలకమైన కృష్ణా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఊహించని చంద్రబాబు.. యువగళం యాత్ర తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టనున్నారని చెబుతున్నారు. ఈలోగా బెజవాడ బ్యాచ్ నాయకులు సర్దుకుంటారో లేక.. యథావిధిగా హౌస్ అరెస్టు పేరుతో ఇళ్లకే పరిమితమవడానికి కంటిన్యూ చేస్తారోననేది టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు