Budvel Venture: హైదరాబాద్‌ బుద్వేల్‌ వెంచర్‌కు భారీ డిమాండ్.. అందుబాటు ధరల్లో గృహాలు!

huge demand for hmda budvel venture

HMDA Budvel Venture: గ్రేటర్ హైదరాబాద్‌తో (Hyderabad) పాటు శివారు ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే మౌలిక వసతుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ.. శివారు ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పక్కా ప్రణాళికతో భాగ్యనగరం చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరంలో హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా భూముల అమ్మకాలే కాకుండా ఓపెన్ ప్లాట్ లేఅవుట్లను ఏర్పాటు చేస్తోంది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే-అవుట్లకు ప్రజలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఉప్పల్ భగాయత్ కాలనీలో లేఅవుట్ (Uppal Bhagayath Hmda Layout) అభివృద్ధి, కోకాపేట్ భూములు, మోకిల ప్లాట్ల వేలం తరువాత బుద్వేల్ భూములను సక్సెస్‌ఫుల్‌గా వేలం వేసింది తెలంగాణ ప్రభుత్వం.

బెంగళూరు జాతీయ రహదారిపై రాజేంద్రనగర్ మండలంలో ఉన్న బుద్వేల్‌లో ఉన్న 300 ఎకరాల్లో 100 ఎకరాలను వేలం వేసింది హెచ్ఎండీఎ. ఈ వంద ఎకరాల భూమి అమ్మకం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. గురువారం వేసిన బుద్వేల్ భూముల వేలంలో 100 ఎకరాలకు 3,625 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడ ఎకరానికి కనిష్ఠంగా 33.25 కోట్ల రూపాయల ధర పలకగా, అత్యధికంగా ఎకరానికి 41.75 కోట్ల ధర పలికింది. బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొని భూములను దక్కించుకోవడంతో భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు రానున్నాయి.

Also Read: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

బుద్వేల్ హెచ్ఎండీఎ లేవుట్‌కు ఒకవైపు హిమాయత్‌సాగర్‌ వ్యూ కనిపిస్తుండగా, మరోవైపు శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ ఉంటుంది. రాజేంద్రనగర్‌లో ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్‌ రోడ్డుకు అతి సమీపంలో ఈ వెంచర్‌ ఉంది. ఇక్కడి నుంచి ఐటీ కారిడార్‌తో పాటు ఎయిర్ పోర్ట్‌కు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక సిటీలోంచి వచ్చే వారు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అత్తాపూర్‌ ర్యాంపు వద్ద కిందకు దిగి రాజేంద్రనగర్‌ నుంచి ఈ లేఅవుట్‌కు 10 నిమిషాల్లో రావచ్చు. బుద్వేల్ లేఅవుట్‌ను ఎయిర్‌ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోస్టేషన్‌కు కనెక్ట్ చేయనున్నారు. బుద్వేల్‌లోని హెచ్ఎండీఎ వెంచర్‌తో పాటు పరిసరాల్లోని భూముల్లోను భారీ నివాస ప్రాజెక్టులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Also Read: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై మిడిల్ క్లాస్ ఆశలు.. రూ.30-45 లక్షల రేంజ్ అయితే ఓకే!

ఇప్పటికే ఐటీ హబ్‌తో పాటు మాదాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో గృహాలకు మంచి డిమాండ్ ఉండటంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో ఐటీ హబ్‌కు చేరువలో ఉన్న బుద్వేల్‌లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులతో భారీ స్థాయిలో నివాస ప్రాజెక్టులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. ఇక బుద్వేల్‌కు పది నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో మధ్య తరగతి వారికి నివాస ప్రాంతంగా అందుబాటులోకి వస్తుందని రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడ పలు నిర్మాణ సంస్థలు అపార్ట్ మెంట్స్ నిర్మిస్తుండగా ఫ్లాట్ ధర 60 లక్షల నుంచి మొదలవుతోంది. ఇక ఇప్పుడు హెచ్ఎండీఏ వెంచర్ అభివృద్ధితో ఇక్కడ భారీ నివాస ప్రాజెక్టులు రానుండటంతో ఐటీ హబ్‌తో పోలిస్తే ఇక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే అవకాశం ఉందని రియాల్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు