కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. దెబ్బకు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గింపు..!

Union Budget 2024 : గోల్డ్, సిల్వర్‌పై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి..

Gold, silver prices fall by up to Rs 4k ( Image Source : Google )

Gold And Silver Prices Fall : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (జూలై 23) పార్ల‌మెంట్‌లో సాధారణ బడ్జెట్‌ 2024ను ప్ర‌వేశ‌పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా పన్ను మినహాయింపులతో పాటు వస్తువులపై పన్నుల‌ను కూడా పెంచింది. కొత్త బ‌డ్జెట్ వేళ.. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.

Read Also : Budget 2024 Memes: కేంద్ర బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్

15శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు :
గోల్డ్, సిల్వర్‌పై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు రూ. 72,838 నుంచి 10 గ్రాములకు రూ.68,500కి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు దాదాపు 2,397.13 డాలర్లుగా నమోదయ్యాయి. (MCX)లో వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.88,995 నుంచి రూ.84,275కి పడిపోయాయి.

లోహాలకు పెరగనున్న డిమాండ్ :
ఈ తగ్గింపు బులియన్ పరిశ్రమకు సానుకూల పరిణామమని ఆగ్‌మాంట్, గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొఠారి అభివర్ణించారు. “కస్టమ్స్ డ్యూటీని 15శాతం నుంచి 6శాతానికి తగ్గించడం చాలా ముఖ్యం. కస్టమ్ డ్యూటీపై 5శాతం కోత అంచనా వేసినప్పటికీ, వాస్తవానికి 9శాతం తగ్గింపు ప్రశంసనీయం. ఈ తగ్గుదలతో వినియోగదారులు తక్కువ రేటుకే బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఎంసీఎక్స్ బంగారం ధరలు రూ. 73వేల నుంచి రూ. 69వేలకి పడిపోయాయి. 10 గ్రాములకు దాదాపు రూ. 67వేల వరకు తగ్గవచ్చు’’ అని కొఠారి అభిప్రాయపడ్డారు.

జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్ మాట్లాడుతూ.. “కస్టమ్స్ డ్యూటీని 15శాతం నుంచి 6శాతానికి తగ్గించడం వల్ల దేశీయ ధరలు తగ్గవచ్చు. లోహాలకు డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో డ్యూటీలో 10శాతం బీసీడీ, ఏఐడీసీ 5శాతంగా ఉన్నాయి’’అని పేర్కొన్నారు.

డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడులకు సమయం :
విఘ్నహర్తా గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా కూడా దిగుమతి సుంకం తగ్గింపుపై స్పందించారు. “కస్టమ్స్ సుంకం తగ్గింపు త్వరగా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. పెట్టుబడిదారులకు సానుకూలమే అయినప్పటికీ, చైనా నుంచి చర్యలు వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చు. వినియోగదారులకు బంగారం ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చులు, 2.5శాతం వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్‌లలో పెట్టుబడి పెట్టడానికి సమయం” అని తెలిపారు.

రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా తగ్గనున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద, కస్టమ్స్ సుంకం తగ్గింపు వినియోగదారులకు, బులియన్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Read Also : Political Reactions on Budget 2024: కుర్చీని కాపాడుకునే బడ్జెట్.. రాహుల్ గాంధీ కామెంట్స్ వైరల్

ట్రెండింగ్ వార్తలు