మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడితోపాటు మరో ఐదుగురు అనుచరులపై భూకబ్జా కేసు

  • Publish Date - December 9, 2020 / 08:18 PM IST

Land grab case against Minister Mallareddy : తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. ఆయన కుమారుడు భద్రారెడ్డితో పాటు మరో ఐదుగురు అనుచరులపైనా దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి సూరారంలో 20 గుంటల భూమిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారనేది అభియోగం. మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆస్పత్రుల మధ్య ఉన్న భూమిని బలవంతంగా ఆక్రమించుకోవడమేగాక, మిగిలిన భూమిని కూడా అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పొన్నబోయిన శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. తనకు మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.



శ్యామలాదేవి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని సర్వేనంబరు 115, 116, 117లో స్థానికంగా ఉండే పొన్నబోయిన శ్యామలాదేవి తల్లి పద్మావతి పేరున 2 ఎకరాల అది మంత్రి మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉంది. ఆ భూమిని తనకు విక్రయించాలని మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. వినకపోవడంతో బెదిరింపులకు దిగారు. అంతేకాదు 20 గుంటల భూమిని కబ్జాచేసి ప్రహరీగోడను నిర్మించారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వివాదంలో మల్లారెడ్డి అనుచరులు అనేకసార్లు శ్యామలాదేవిని, సోదరిని, తల్లి పద్మావతిని బెదిరించారు.



బెదిరింపుల నేపథ్యంలో శ్యామలాదేవి కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణ అనే న్యాయవాదిని సంప్రదించామని తెలపారు…. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి.. న్యాయవాదిని మచ్చిక చేసుకొని… స్టాంప్‌ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకురావాలని సూచించారని… ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకని చెప్పి స్టాంప్‌ పేపర్లపై తన సంతకం, ఆమె తల్లి పద్మావతి, సోదరి సంతకాలు తీసుకుని.. వాటిని మంత్రి మల్లారెడ్డికి ఇచ్చారని తెలిపారు… వాటిపైనే భూమి విక్రయం జరిగినట్లుగా మార్చేశారని… మంత్రి అనుచరుడు గూడూరు మస్తాన్‌కు భూవిక్రయం జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని శ్యామలా దేవి ఆరోపించారు..



కొంత కాలం తర్వాత శ్యామలాదేవి తల్లి, సోదరి మరణించారు. మిగతా భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయకుంటే చంపేస్తామని మంత్రి, ఆయన అనుచరులు శ్యామలాదేవిని భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. అయితే పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో శ్యామలాదేవి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో బాధ్యులపై కేసు నమోదు చేయాలని దుండిగల్‌ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డి , భద్రారెడ్డి, ఎం.రాజు, న్యాయవాది లక్ష్మీనారాయణ, మస్తాన్‌, పుల్లయ్య, చంద్రయ్యలతో పాటు మరికొందరిపై ఐపీసీ 447, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద ఈ నెల 6న కేసులు నమోదు చేశారు.



ఇదిలా ఉంటే దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. భూమిని కబ్జా చేశాననడంలో వాస్తవం లేదని, ప్రస్తుతం సూరారంలో ఎవరి భూమి వారికే ఉందన్నారు.. ఏడాది క్రితం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు వచ్చిందని, వారు విచారణ చేయకుండా జాప్యం చేశారని చెప్పారు. హైకోర్టు జోక్యంతో తాజాగా కేసు నమోదు చేశారని, తాను ఎవరి భూమినీ ఆక్రమించలేదన్నారు..



తమకు మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డితో ప్రాణహానీ ఉందంటున్నారు శ్యామల. రెండు ఎకరాల 13 గుంటల భూమిలో అర ఎకరం మాత్రమే మల్లారెడ్డికి అమ్మారని… ఆ తర్వాత సంతకాలను ఫోర్జరీ చేసి మిగితా భూమిని మస్తాన్‌కి విక్రయించినట్లు సృష్టించారని ఆమె ఆరోపిస్తున్నారు. భద్రారెడ్డి తన మనుషులతో ఇంటికి పంపించి, చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఆరోపిస్తోంది. సర్వే నెం 115, 116, 117 లో ఉన్న భూమిని సర్వే చేపించాను…సర్వేలో తన భూమిలో 20 గుంటలు మల్లారెడ్డి ఆక్రమించుకున్న ట్లు తేలిందన్నారు. అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనను భూమి అమ్మాల్సిందిగా బెదిరిస్తున్నాడు…మల్లారెడ్డి భూ ఆక్రమణ బెదిరింపులపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు.



ఒకటిన్నర ఎకరా భూమిని ఫోర్జరీ చేసి వారే కోర్టులో కేసు వేసి తనను కోర్టుకు లాగారు..2015 లో తన తల్లి చనిపోవడంతో తప్పుడుగా కోర్టులోదావా వేసిన మస్తాన్ తనకు కోర్టు ద్వారా నోటీసు పంపారని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్ లతో తన భూమి తనది కాదని తెలపడంతో హెచ్చార్సీ ని ఆశ్రయించానని పేర్కొన్నారు. మల్లారెడ్డి తన అనుచరులను ఇంటికి పంపించి భూమిని అమ్మాల్సిందిగా ఎంతో కొంత డబ్బు ఇస్తామని బెదిరిస్తున్నారు…భద్రారెడ్డి తన మనుషులతో ఇంటికి పంపించి చంపేస్తామని బెదిరించారని తెలిపారు.



తనకు భూ వివాదంతో ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి మల్లారెడ్డి. ఎప్పుడో చేసిన ఫిర్యాదు ఇప్పుడు తెరపైకి వచ్చిందని తెలిపారు. తనకు భూములు కబ్జా చేసే అవసరం లేదన్నారు. బాధిత మహిళకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. తనపై వస్తోన్న ఆరోపణలపై పోలీసు అధికారులతో సంప్రదించానని మల్లారెడ్డి తెలిపారు.



తమపై వస్తోన్న ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి స్పందించారు. ఫిర్యాదురాలు శ్యామలను తాము ఎప్పుడు కలువలేదని.. భూమి కొనుగోలుకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారాయన. భూమి కోసం బెదిరించాల్సిన అవసరం లేదన్నారు భద్రారెడ్డి. ఆక్రమణకు గురైందని అనుకుంటే సర్వే చేయించుకోవచ్చంటున్నారు. శ్యామల అమ్మితే కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎకరం భూమి కోసం బెదిరిస్తామా? అని అన్నారు. మస్తాన్‌ ఎవరో తమకు తెలియదన్నారు. ఈ భూ వివాదం 15 ఏళ్ల నుంచి నడుస్తోందని చెప్పారు. పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు