వయనాడ్ సీట్‌ను వదులుకున్న రాహుల్.. ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Vadra: వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల బరిలో నిలవనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండింట్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అలాగే, వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని చెప్పారు.

వయనాడ్ ప్రజలను జీవితాంతం గుర్తుంచుకుంటానని రాహుల్ గాంధీ అన్నారు. తనను వయనాడ్ ప్రజలు ఎంతగానో అభిమానించారని చెప్పారు. ప్రియాంక గాంధీతో పాటు వయనాడ్ కి వెళ్తూ ఉంటానని తెలిపారు. వయనాడ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు. రాయబరేలి నుంచి ఎంపీగా కొనసాగడం సంతోషంగా ఉందని తెలిపారు.

కాగా, గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ బరిలో ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని భావించినా.. అనూహ్యంగా రాహుల్‌ పేరును ప్రకటించింది ఏఐసీసీ. కంచుకోటగా ఉన్న ఈ సీటు నుంచి ఇంతకు ముందు వరకు ఎంపీగా కొనసాగారు సోనియా. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ సెగ్మెంట్‌లో కేవలం మూడుసార్లు మాత్రమే హస్తం పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. అంతకుముందు ఆమె భర్త, కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. 1962, 1999 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయలేదు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ నుంచి ఫిరోజ్‌ గాంధీ ఎంపీగా నెగ్గారు.

దాదాపు పదేళ్ల గ్యాప్‌ తర్వాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు సార్లు గెలిచారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్‌ నారాయణ్‌ విజయం సాధించారు. 1980లో మరోసారి ఇందిరాగాంధీ గెలిచారు. ఆ తర్వాత అరుణ్‌ నెహ్రూ, షీలా కౌల్‌ కాంగ్రెస్‌ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ నేత అశోక్‌ సింగ్‌ ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు.

ఆ తర్వాత 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి సతీష్‌ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదుసార్లు..2006 ఉప ఎన్నికతో సహా సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ వచ్చారు. 1952-2019 వరకు ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయింది. మరోవైపు 2019 ఎన్నికల్లోనూ రాహుల్‌ వయనాడ్‌లో ఘనవిజయం సాధించారు.

Also Read: ఉక్కుపాదం మోపుతాం.. 3 నెలల్లో మార్పులు తీసుకొస్తాం: హోం మంత్రి అనిత

ట్రెండింగ్ వార్తలు