భక్తులతో నిండిపోయిన ఆలయాలు.. ప్రజల్లో దైవచింతన ఎందుకింతలా పెరిగింది..? కరోనా మనిషిలో మార్పు తెచ్చిందా?

పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్చిందన్న విషయం అర్ధమవుతోంది.

Devotees Rush At Temples : కొండంత భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. యాదాద్రి, విజయవాడ దుర్గమ్మ గుడి, బాసర ఇలా ఆలయాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారు, అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. ఇప్పుడే కాదు.. ఏ చిన్న సందర్భం వచ్చినా.. నాలుగు రోజులు సెలవులొచ్చినా.. దైవ దర్శనానికి బయలుదేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి నెలకొంది. యువత సంగతి ఇక చెప్పాల్సిన పని లేదు. భక్తుల జాబితాలో యువతే ముందు వరుసలో ఉంటోంది. మొత్తంగా కరోనా తర్వాత మనిషి ఆలోచనలో మార్పు వచ్చింది. ఆధ్మాత్మిక పర్యాటకం పెరిగిపోయింది. అసలు ప్రజల్లో భక్తిభావం ఎందుకింతలా పెరిగింది..?

తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉండే పుణ్యక్షేత్రం తిరుమల ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతోంది. కొన్నిసార్లు 30 గంటలకుపైగా వేచి ఉండి శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాల్సి వస్తోంది. తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు అన్నమాట సర్వసాధారణంగా మారింది. ఇక పండుగలు, సెలవులు, ముక్కోటి ఏకాదశి లాంటి ప్రత్యేక సందర్భాలైతే… అమ్మో అసలు స్వామి వారి దర్శనం దొరుకుతుందా అన్న సందేహాలు నెలకొంటున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ ఏడు కొండలవాడిని దర్శించుకోవడానికి భక్తులు వెల్లువలా తరలివస్తున్నారు.

ఏడాదిలో రెండు, మూడుసార్లు తిరుమలకు..
గతంలో ఏడాదికోసారి తిరుపతి వెళ్లే వారు భక్తులు. కొందరు రెండు, మూడేళ్లకోసారి వెళ్లే వారు. కానీ ఇప్పుడు చాలామంది ఏడాదిలో రెండు, మూడు సార్లు క్యూలైన్ల కష్టాలు, దర్శనం కోసం ఎదురుచూపుల గురించి పట్టించుకోకుండా తిరుమల వెళ్తున్నారు. క్యూలైన్లు, భారీగా నిండిపోయి, వైకుంఠం వెలుపలకు విస్తరించిన క్యూలైన్లలోకి భక్తులను అనుమతించని పరిస్థితులూ తరచుగా ఏర్పడుతున్నాయి.

సెలవులు వస్తే చాలు.. పుణ్యక్షేత్రాల దర్శనం
తిరుమలే కాదు.. తెలుగు రాష్ట్రాలు.. ఆ మాటకొస్తే దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు నాలుగు రోజులు సెలవులు వచ్చినా.. పండుగ సెలవులొచ్చినా.. వేసవి సెలవులొచ్చినా.. పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్లే వారు ఇప్పుడు ముందుగా ఆధ్యాత్మిక క్షేత్రాలకు బయలుదేరుతున్నారు. పుణ్యక్షేత్రాల దర్శనం తర్వాతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లేలా షెడ్యూల్ చేసుకుంటున్నారు. అందుకే తిరుమల, విజయవాడ ఇంద్రకీలాద్రి, బాసర సరస్వతీ దేవి ఆలయం, వేములవాడ, యాదాద్రి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆలయాలన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. పేరుమోసిన ఆలయాలే కాదు.. స్థానికంగా ఉండే గుళ్లకూ భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది.

మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన భక్తి..
దగ్గరలో ఉండే ఆలయాలకే కాదు… చార్ ధామ్ యాత్రలకు, వారణాసి, అయోధ్యకు, అమర్‌నాథ్ యాత్రలకూ వెళ్తున్న వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా ఉంటోంది. చెప్పాలంటే భక్తి…. మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఒకప్పుడు పండగలప్పుడు మాత్రమే కనిపించే భక్తిభావం ఇప్పుడు ఏడాదిలో 365 రోజులూ కనిపిస్తోంది. ఒక్కోరోజు ఒక్కో దేవుణ్ని పూజించడం, తరచుగా ఆలయాలు సందర్శించడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి గుళ్లో కాసేపు గడపడం అందరికీ అలవాటుగా మారుతోంది. ఇలా భక్తిని జీవితంలో భాగంగా మార్చుకునే వాళ్లు గతంలో 50 ఏళ్ల పై వయసు వారై ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 60ఏళ్లు పైబడిన వృద్ధుల కన్నా ఎక్కువగా 20ఏళ్ల పైబడిన యువత ఆలయాలకు పరుగులు తీస్తోంది. దేవుని కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధతో పాల్గొంటోంది. భగవంతుని సేవలో నిమగ్నమవడం అస్తిత్వ చిహ్నంగా భావిస్తోంది.

ఊహించని స్థాయిలో పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యాటకం..
దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో గత ఏడాది ఆధ్యాత్మిక పర్యాటకం పెరిగింది. దక్షిణాది ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు ఉత్తరాదిన ఉన్న ప్రముఖ ఆలయాలకు వెళ్తోంటే.. ఉత్తరాది ప్రజలు…దక్షిణాదిన ఆలయాలకు బారులు కడుతున్నారు. ఇలా దేశమంతా ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్న వారిలో యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారని టూరిస్టు సంస్థల నిర్వాహకులు తెలిపారు. పుణ్యక్షేత్రాలకు భారీగా వెళ్తున్న యువత సంఖ్య కరోనా తర్వాత భారీగా పెరిగిందని చెప్పారు.

కరోనా తర్వాత ప్రజల్లో పెరిగిన దైవచింతన..!
పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరడం రిటైరయిన తర్వాత చేయాల్సిన ప్రయాణంగా ఇప్పుడు ఎవరూ చూడడం లేదు. యువతీ యువకులు సొంతంగా మాత్రమే కాకుండా కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తుండడం గమనిస్తే మహమ్మారి తర్వాత భారతీయల ఆలోచనల్లో మార్పు వచ్చిందన్న విషయం అర్ధమవుతోంది. కరోనా పరిస్థితులు దగ్గరగా గమనించడం, కొందరు అయిన వారిని పోగొట్టుకోవడం, రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండడం, కరోనా దుష్పరిణామాలను ఇంకా అనుభవిస్తుండడం వంటివాటితో దేశ ప్రజల్లో దైవచింతన పెరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్‌లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్

ట్రెండింగ్ వార్తలు