ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్‌లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్

ఈవీఎంలపై మొదటి నుంచీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన అసలు ఓట్లకు, లెక్కించిన ఓట్లకు, మెజార్టీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలుంటున్నాయని జాతీయ మీడియాలో కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్‌లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్

EVM Hacking Row : సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ భారతదేశంలో ఓ అంశం చర్చకు వస్తూ ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా ఫలితాలు తారుమారు చేయవచ్చని. ఎన్నికల్లో ఓటమిపై అనుమానాలున్న ప్రతి పార్టీ ఈ తరహా ఆరోపణలు చేయడం సహజంగా మారింది. ఈ ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఈవీఎంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొన్ని పార్టీల నేతలు ఫలితాలు విడుదలైన దగ్గరి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ చేసిన ఓ ట్వీట్‌తో భారత్‌లో భారీ దుమారం చెలరేగింది.

ఈవీఎంల విశ్వసనీయత, భద్రతపై అనేక సందేహాలు..
ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదలయ్యాయి. మరుసటిరోజు నుంచి ఈవీఎంల గురించి దేశంలో చర్చ మొదలైంది. జాతీయ పత్రికలు, వెబ్‌సైట్లు పరిశోధనాత్మక కథనాలు రాశాయి. ఈవీఎంల విశ్వసనీయత, భద్రతపై అనేక సందేహాలు లేవదీశాయి. కాంగ్రెస్ సహా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన పార్టీలలో అనేకం ఈవీఎంల గురించి మాట్లాడడం ప్రారంభించాయి. ఈ రచ్చ కొనసాగుతుండగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల కోసం ఈవీఎంలపై చేసిన ఓ ట్వీట్ తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా దుమారం లేపింది. ఈవీఎంలపై అనుమానం ఉన్న వాళ్లంతా ఎలాన్‌ మస్క్‌తో గొంతు కలుపుతున్నారు.

AI లేదా వ్యక్తులతో ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చు..!
పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. AI లేదా వ్యక్తులతో ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించి వేయాలని ఆయన ట్వీట్ చేశారు. AIతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైనదని మస్క్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో అవకతవకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా మస్క్ ఈ ట్వీట్ చేశారు.

ఈవీఎంల చిప్‌లపై సందేహాలు..
మస్క్ ఈ ట్వీట్ అమెరికాలో చేస్తే.. దానికి రీసౌండ్ ఇండియాలో వస్తోంది. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక నిరాశ చెందిన ఇతర పార్టీలు…మస్క్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. పనిలోపనిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ముంబైలో గోరేగావ్ ప్రాంతంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ కోసం ఫోన్ వాడారన్న ఆరోపణలపై శివసేన షిండే వర్గం ఎంపీ బంధువుపై కేసు నమోదు కావడం మరింత సంచలనంగా మారింది. ఈవీఎంల చిప్‌లపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తోంటే.. మరికొందరు 20లక్షల ఈవీఎంలు మిస్సయ్యాయని, అవెక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు.

ఈవీఎంలు విమానాల్లోని బ్లాక్ బాక్సుల్లాంటివి..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈవీఎంలపై మొదటి నుంచీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన అసలు ఓట్లకు, లెక్కించిన ఓట్లకు, మెజార్టీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలుంటున్నాయని జాతీయ మీడియాలో కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మస్క్ ట్వీట్ తర్వాత రాహుల్ గాంధీ ఈవీఎంలపై మరింత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంలు విమానాల్లోని బ్లాక్ బాక్సుల్లాంటివని, వాటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించరని రాహుల్ గాంధీ కౌంటర్ వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక సందేహాలు దేశమంతా వ్యక్తమవుతున్నాయని, వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగా మిగిలిపోతుందని రాహుల్ హెచ్చరించారు.

టెక్నాలజీ సమస్యలకు కారణమైతే వాడకం ఆపేయాలి..
మస్క్ పోస్టుతో పాటు ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభపై వచ్చిన వార్తా కథనాన్ని ఆయన షేర్ చేశారు. ఇండియా కూటమి నేతలూ మస్క్ పోస్టును, రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మెజార్టీ స్థానాల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఈవీఎంలను తప్పుపట్టారు. మస్క్ పోస్టును షేర్ చేసిన అఖిలేశ్ యాదవ్ సాంకేతికత సమస్యలను తొలగించడానికి ఉపయోగపడాలని, అదే సమస్యలకు కారణమైతే…దాని వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు.

Also Read : శత్రువుపై నాగాస్త్రం.. భారత ఆర్మీ అమ్ములపొదిలో సరికొత్త ఆయుధం