T20 World Cup 2026 : సంజూ శాంసన్ కానే కాదు.. అతడే ఈ దేశ సంపద.. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలవడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Suryakumar Yadav comments after India win T20 World cup 2026
- టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్
- సంతోషంగా ఉందన్న సూర్యకుమార్ యాదవ్
- రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా, స్వదేశంలో తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకున్న జట్టుగా టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ 96 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. భారత జట్టుకు ఇది మూడో ప్రపంచకప్ కావడం విశేషం. గతంలో 2007లో ధోని సారథ్యంలో, 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ పొట్టి ప్రపంచకప్‌లను ముద్దాడింది. ఇక ఈ విజయంపై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. సంజూ శాంసన్ (89; 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (52; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (54; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శివమ్ దూబె (26 నాటౌట్; 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాట్ హెన్రీ, రచిన్ రవీంద్రలు చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 52 పరుగులు), మిచెల్ సాంట్నర్ (35 బంతుల్లో 43 పరుగులు) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ మూడు వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలు తలా ఓ వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌ను సాధించడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తాము టీ20 ఛాంపియన్లు అనేది విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. ఇక తనపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన అప్పటి బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ధన్యవాదాలు తెలియజేశాడు. పేసర్ బుమ్రా తరానికి ఒక్క బౌలర్ అని, అతడు ఈ దేశ సంపదని కొనియాడాడు.
‘ఈ విజయాన్ని జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కెప్టెన్‌గా నాది సుదీర్ఘ ప్రయాణం. టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన తరువాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షాలు నా పై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించడంతో కెప్టెన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్ గెలిపించడంతో ప్రయాణం ముగిసింది.’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
గత రెండేళ్లుగా తాము ఎంతో మంచి క్రికెట్ ఆడుతున్నామని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో తాము అనుసరించిన మంచి అలవాట్లనే కొనసాగించాలని అనుకున్నాము. ఇక కుర్రాళ్లు కూడా దాన్ని కొనసాగించారు. ఇక కెప్టెన్‌గా తన పని ఆటగాళ్ల పై నమ్మకం ఉంచడమేనని అన్నారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలు అద్భుతమైన ఆటగాళ్లు, వారు మ్యాచ్ విన్నర్లు అని కూడా తెలుసు. ప్రత్యేక సందర్భాల్లో ఎలా రాణించాలో వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నాడు.
బుమ్రా దేశ సంపద..
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి లాంటి ప్లేయర్లు తరానికి ఒక్కడు మాత్రమే ఉంటాడని అన్నాడు. అతడు ఈ దేశ సంపద అని చెప్పుకొచ్చాడు. గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను బుమ్రాకు ఇవ్వాలని సంజూ శాంసన్ చెప్పినట్లుగానే తాను చెబుతానన్నాడు. మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో అతడికి బాగా తెలుసు. ఈ రంగంలో అతడు అత్యుత్తమ ఆటగాడు. భవిష్యత్తులోనూ అతడు దానిని కొనసాగిస్తాడని అనుకుంటున్నాను. అని సూర్య అన్నాడు.
రిటైర్మెంట్ పై మాట్లాడుతూ..
ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వచ్చాయి. దీనిపై అతడికి ప్రశ్న ఎదురైంది. దీనిపై సూర్య మాట్లాడుతూ.. ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదా.. ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు అంటూ సమాధానం ఇచ్చాడు.
