Karthika Pournami: రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలి, పండితులు ఏం చెబుతున్నారు..

పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుందన్నారు.

Karthika Pournami: రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలి, పండితులు ఏం చెబుతున్నారు..

Updated On : November 4, 2025 / 6:57 PM IST

Karthika Pournami: రేపు పౌర్ణమి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి ఎంతో శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. మరి కార్తీక పౌర్ణమి రోజున ఏమేం చేయాలి? పండితులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం..

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానం చేయాలని పండితులు తెలిపారు. ఆ తర్వాత శివలింగానికి రుద్రాభిషేకం చేయాలన్నారు. నదీ స్నానం చేయలేని వారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చని సూచించారు. ఇక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుందన్నారు. అలాగే తులసి పూజ చేయాలన్నారు. దాంతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు తెలిపారు.

ఇవాళ రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి రేపు సాయంత్రం 6గంటల 48 నిమిషాల వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు తెలిపారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచించారు. రేపు ఉదయం 4గంటల 52 నిమిషాల నుంచి 5గంటల 44 నిమిషాల మధ్య సమయంలో నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలన్నారు. సాయంత్రం 5గంటల 15 నిమిషాల నుంచి రాత్రి 7గంటల 5 నిమిషాల వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచించారు.

ఇక కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో చీకటి ఉండకుండా చూసుకోవాలని పండితులు సూచించారు. అలాగే ఈరోజు మద్యం, మాంసాహారం ముట్టుకోకూడదని చెప్పారు.

పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పారద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారని పండితులు వివరించారు.

ఏడాది మొత్తానికి కలిపి దీపం వెలిగించాలి…

కార్తీక పౌర్ణ‌మి అత్యంత విశిష్టమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపారాధన చేయలేని వారు కనీసం పౌర్ణమి నాడైనా దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ఏడాది మొత్తానికి కలిపి 365 వత్తులతో దీపం వెలిగించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో లేదా ఇంట్లోనే దేవుని ముందు, తులసి కోట ఎదుట దీపం వెలిగించొచ్చు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే విశేష ఫలం లభిస్తుందన్నది పండితుల మాట. దీపారాధన చేసే సమయంలో దామోదర ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పుకోవాలి. పౌర్ణమి రోజున వెలిగించే దీపాలు ఆత్మజ్యోతిని కూడా ప్రకాశింపజేస్తాయని విశ్వసిస్తారు.

Also Read: కేతువు ఆరాధనలో గణపతి ప్రాశస్త్యము.. ఇలా పూజిస్తే మీ సమస్యలన్నీ పారిపోతాయ్.. ఐశ్వర్యం అంతా మీదే….