Mauni Amavasya 2026: నేడు మౌని అమావాస్య.. చాలా అరుదైన రోజు.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, ధన లాభం ఖాయం..!
మౌని అమావాస్య రోజున కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. మౌని అమావాస్య రోజున గుప్త దానం (రహస్య దానం) చేస్తే చాలా మంచిది.
Mauni Amavasya 2026 Representative Image (Image Credit To Original Source)
- మూగ జీవాలకు ఆహారం పెట్టాలి, సూర్యుడికి అర్గ్యం వదలాలి..
- మంచం దానం ఇవ్వొచ్చు. ధాన్యం, వస్త్రాలు, ధనం దానం ఇవ్వొచ్చు
- శత్రుదోషాలు, బ్లాక్ మ్యాజిక్ లు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు
Mauni Amavasya 2026: మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మాఘ మాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ మౌని అమావాస్య ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం వచ్చింది. మంగళవారం, అమావాస్య కలిసి వచ్చింది కనుక దాన్ని భౌమ అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు.
ఈ మాఘ అమావాస్యని మౌని అమావాస్య అని ఎందుకు అంటారంటే.. ఆ రోజు మౌనంగా ఉంటే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. మౌన వ్రతం పాటిస్తే చాలా మంచిది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందే రోజు కాబట్టి దీన్ని మౌని అమావాస్య అంటారు. ఆరోజు గంగా స్నానం చేస్తే చాలా మంచిది. గంగా స్నానం వీలు కాకపోతే గంగా జలం కొద్దిగా కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తూ గంగా గంగా అని మనసులో స్మరించుకోవాలి.
మూగ జీవాలకు ఆహారం పెట్టాలి, సూర్యుడికి అర్గ్యం వదలాలి..
మౌని అమావాస్య రోజు మూగ జీవాలకు ఆహారం పెట్టాలి. జంతువులు, పక్షులకు ఆహారం అందించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. శివుడు, విష్ణువును ఆరాధన చేయటం ద్వారా కూడా ఆ రోజున విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అమావాస్య అంటేనే సూర్యుడు ఆవిర్భవించిన తిథి. మౌని అమావాస్య సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి.. ఆరోజున రాగి చెంబులో నీళ్లు తీసుకుని, ఆ నీళ్లలో ఎర్ర చందనం లేదా కుంకుమ కలిపిన అక్షితలు, ఎర్ర పువ్వులు వేసి తూర్పువైపున తిరిగి ఓం సవిత్రే నమ: అని 12 సార్లు చెప్పుకుంటూ 12సార్లు అర్గ్యం ఇవ్వాలి. ఆ అర్గ్యం నీళ్లు మొక్కలో పోయాలి. మౌని అమావాస్య రోజున సూర్యుడికి అర్గ్యం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
మౌని అమావాస్య రోజున చేయాల్సిన దానాలు..
మౌని అమావాస్య రోజున కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. మౌని అమావాస్య రోజున గుప్త దానం (రహస్య దానం) చేస్తే చాలా మంచిది. రహస్య దానం అంటే మీరిచ్చిన దానం గురించి ఎవరికీ చెప్పకూడదు.
మంచం దానం ఇవ్వొచ్చు
ధాన్యం,
వస్త్రాలు,
ధనం,
పాదరక్షలు
వీటిలో ఏవి దానం ఇచ్చినా జాతకంలో సూర్యుడు, శని బలంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు.
జాతకంలో దోషాల వల్ల పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న వారంతా మౌని అమావాస్య రోజున గోధుమలు, బెల్లం, నెయ్యి పంతులికి వీలైనంత దానం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా మంగళ దోషాలు తొలగి వివాహం అవుతుంది.
జాతకంలో పితృ దోషాలు, పితృ శాపాలు ఉంటే వంశాభివృద్ది జరగదు. ఈ దోషాలు తొలగాలంటే నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. లేదా ఎక్కడైనా గుడిలో దర్బాసనం పంతులుకి దానం ఇవ్వాలి. దర్బాసనం అంటే దర్బ చాప. ఇలా చేస్తే వంశం బాగుంటుంది. 7 తరాలు నిలబడుతుంది. వంశ దోషాలు తొలగిపోతాయి.
అన్నదానం ఎక్కడైనా జరుగుతుంటే.. మీ శక్తి మేర అన్నదాన నిమిత్తమైన ఉప్పు దానం ఇవ్వాలి. మౌని అమావాస్య రోజున లవణ దానానికి చాలా శక్తి ఉంది. ఇలా చేయడం ద్వారా మీకున్న నర దిష్టి, శత్రు బాధలు తొలగిపోవడంతో ధన లాభం కూడా చేకూరుతుంది.
మౌని అమావాస్య రోజున అనారోగ్యంతో ఉన్న వారికి ధనం ఇస్తే ఏడు తరాల వరకు వంశంలో ఎవరికీ అనారోగ్యాలు ఉండవు. వంశం ఉద్దరించబడుతుంది. మౌని అమావాస్య రోజున దగ్గరలో ఏదైనా ఆసుపత్రి ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ అనారోగ్యంతో ఉన్న వారికి మీకు వీలైనంత ధనం ఇవ్వండి. పెరుగు దానం ఇస్తే జాతక దోషాలు తొలగి ధన లాభం కలుగుతుంది.
గుమ్మడికాయ దానం కూడా చాలా గొప్పది. మామూలు గుమ్మడి కాయ లేదా బూడిద గుమ్మడి కాయను మౌని అమావాస్య రోజున దానం ఇస్తే ఆ గుమ్మడి కాయ ఎంత బరువు ఉంటుందో అంత బరువున్న బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అన్ని దానాల కంటే బంగారం దానం చాలా గొప్పది. భయంకరమైన పాపాలు పోగొట్టే శక్తి బంగారం దానానికి ఉంది. అయితే అందరూ బంగారం ఇచ్చుకోలేరు కాబట్టి మౌని అమావాస్య రోజున బంగారం దానంతో సమానం గుమ్మడికాయ దానం.
చేయాల్సిన పూజలు..
శివాలయంలో వీరభద్రుడిని దర్శించుకోవాలి. వీరభద్రుడికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. శివాలయంలో వీరభద్రుడు లేకపోతే కాలబైరవుడిని దర్శనం చేసుకోవాలి. శివాలయంలో కలబైరవుడికి 21 లేదా 24 లేదా 27 లేదా 36 మినప గారెల దండను సమర్పించాలి. మౌని అమావాస్య రోజున కాలబైరవుడికి ఆ దండ సమర్పిస్తే శత్రు బాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడొచ్చు. భద్రకాళి అమ్మవారి ఆలయ దర్శనం కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. అమ్మారికి 21 లేదా 54 లేదా 108 నిమ్మకాలతో దండ సమర్పించాలి. భద్రకాళి అమ్మవారి అనుగ్రహం కలిగి భయంకరమైన శత్రుదోషాలు, బ్లాక్ మ్యాజిక్ లు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ల ఏడుపు, అనారోగ్య సమస్యలు వీటన్నింటి నుంచి బయటపడి సమస్త శుభాలు పొందొచ్చు.
- NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
