Gaddam Prasad Kumar: సడెన్‌గా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్‌ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
Gaddam Prasad Kumar Representative Image (Image Credit To Original Source)
- మంత్రి పదవి ఆశిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- గడ్డం ప్రసాద్‌ను ఢిల్లీకి వచ్చి కలవమని చెప్పిన రాహుల్
- స్పీకర్‌ను రాహుల్ ఢిల్లీకి ఎందుకు పిలిచారన్నదానిపై చర్చ
- అమాత్య పదవి కోసం ప్రసాద్ రాహుల్‌కు అర్జీ పెట్టుకున్నారా?
- ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు విచారణతో స్పీకర్ విసిగిపోయారా?
- ఫిరాయింపు అంశంపై చర్చించేందుకు స్పీకర్‌ను ఢిల్లీకి రమ్మన్నారా?
Gaddam Prasad Kumar: పార్టీ ఫిరాయింపు కేసులు.. విచారణలు.. వాయిదాలు.. ప్రతిపక్షాల విమర్శలు. ఈ ఎపిసోడ్‌తో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విసిగిపోయారా? స్పీకర్ పదవి నుంచి తప్పుకుని అమాత్య పదవి చేపట్టాలని ఆశపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అర్జీ పెట్టుకున్న స్పీకర్‌కు.. ఢిల్లీ వచ్చి కలవమని పిలుపు వచ్చిందంటున్నారు. మంత్రివర్గంలో బెర్త్ ఆశిస్తున్న గడ్డం ప్రసాద్‌కు హస్తిన నుంచి పిలుపు రావడం వెనుక ఆంతర్యమేంటి? త్వరలో క్యాబినెట్ షఫ్లింగ్ ఉంటుందా? గడ్డం ప్రసాద్‌కు బెర్త్ పక్కానా?
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలవడం ఇప్పుడు హస్తం పార్టీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొన్న వికారాబాద్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ..స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఢిల్లీ వచ్చి కలవమని చెప్పారట. పార్టీ శిక్షణా తరగతుల వేదికైన వికారాబాద్ నియోజకవర్గానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయన రాహుల్ గాంధీకి స్వాగతం పలకడంతో పాటు వీడ్కోలు చెప్పేందుకు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్లిన సందర్భంగా..ప్రసాద్ కుమార్‌తో మాట్లాడిన రాహుల్ ఢిల్లీకి వచ్చి కలవమని ప్రత్యేకంగా చెప్పారని తెలుస్తోంది.
స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను రాహుల్ గాంధీ ఎందుకు ఢిల్లీకి పిలిచారన్నదానిపై గాంధీభవన్ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అందులోనూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ స్వయంగా ఢిల్లీ రమ్మని స్పెషల్‌గా స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను పిలిచారంటే సమ్‌థింగ్ ఈజ్ దేర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఏదో బలమైన కారణం లేకుండా రాహుల్ ఎవరినీ ఢిల్లీకి వచ్చి కలవాలని చెప్పరని, అలాంటిది స్పీకర్ పదవిలో ఉన్న ప్రసాద్ కుమార్‌ను హస్తినకు రావాలని పిలిచారంటే కచ్చితంగా ఏదో ఉందని హస్తం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
పార్టీ ఫిరాయింపుల కేసు విచారణతో బాగా విసిగిపోయారా?
ఈ మధ్య స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాలా బిజీగా ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపు కేసులను విచారిస్తున్నారాయన. సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌తో జంపింగ్ ఎమ్మెల్యేల విచారణను స్పీడప్ చేసిన స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక కడియం శ్రీహరి విచారణ పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు. మరోవైపు ఇంకా దానం నాగేందర్ కేసు తుది విచారణను బాకీ ఉంది. ఇలా పార్టీ ఫిరాయింపుల కేసు విచారణతో స్పీకర్ ప్రసాద్ కుమార్ బాగా విసిగిపోయారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎలాంటి తీర్పు ఇస్తారన్నదానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారమంతా స్పీకర్ ప్రసాద్‌కు హెడెక్‌గా మారిందట. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా ప్రసాద్ కుమార్‌కు తలకు మించిన భారంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఢిల్లీకి పిలవడం వెనుక రీజనేంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్‌పై విచారణ క్లైమాక్స్‌కు చేరుకున్న నేపథ్యంలో ఆ అంశంపై చర్చించేందుకు పిలిచి ఉంటారా అన్నదానిపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రివర్గంలో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అమాత్య పదవుల కోసం చాలా మంది ఆశలు పెట్టుకోగా.. అందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట.
మంత్రివర్గంలో బెర్త్ కోసమా? ఫిరాయింపు అంశంపై చర్చించేందుకా?
గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ప్రసాద్ కుమార్ హైకమాండ్ కు లేఖ రాశారు. కానీ అప్పుడు క్యాబినెట్లో ఆయనకు చోటు దక్కలేదు. అయితే మంత్రిపదవిపై ప్రసాద్ కుమార్ ఇంకా ఆశలు పెట్టుకున్నారట. ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్‌ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది మంత్రివర్గంలో బెర్త్ కోసమా? లేక ఫిరాయింపు అంశంపై చర్చించేందుకా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలతో పాటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.
అయితే ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై డిస్కస్ చేస్తే..రాహుల్‌తో భేటీ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? మంత్రి వర్గంలో చోటు కోసమైతే గడ్డం ప్రసాద్ ప్లేస్‌లో స్పీకర్ అయ్యేదెవరనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రసాద్‌కుమార్‌ను క్యాబినెట్లోకి తీసుకుంటే..ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు ఎస్సీ ఎమ్మెల్యేల్లో ఒకరికి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు. రాహుల్‌తో స్పీకర్ భేటీ తర్వాత ఏం జరగబోతోందో చూడాలి.
Also Read: వేం నరేందర్.. మరో కేవీపీ? పట్టుబట్టి ఆప్తుడికి రాజ్యసభ సీటు ఇప్పించుకున్న సీఎం రేవంత్
