టార్గెట్ బీజేపీ? ఈవీఎంలపై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణల వెనుక అనేక అనుమానాలు

కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.

Evm Hacking Row : ఈవీఎంలపై మస్క్ వ్యాఖ్యలను ఇండియా కూటమి సమర్థిస్తోంటే అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. మస్క్ వ్యాఖ్యలను కేంద్రం తరపున ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయగలిగినప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కదా అని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిండే స్పందించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

భారత్‌లో ఈవీఎంల వాడకం 2004లో మొదలు..
భారత్‌లో ఈవీఎంల వాడకం 2004లో మొదలైంది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న NDA ఓడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ఘోర పరాజయం పొందింది. కేంద్రంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ ఘనవిజయం తర్వాత ఈవీఎంలకు వ్యతిరేకంగా బలంగా వాదనలు..
2004 నుంచి దేశంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి. మొదటినుంచీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం తర్వాత ప్రతిపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా బలంగా వాదనలు వినిపించడం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన పలు పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. అలాగే తాము గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా మాటలు మారుస్తూనే ఉన్నాయి.

ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే ఈవీఎంలపై ఆరోపణలు..
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్‌పైనా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో నిజానికి కాంగ్రెస్ బాగా బలపడింది. 2014 తర్వాత తొలిసారి 99 స్థానాలను సొంతంగా సాధించింది. కాంగ్రెస్ ప్రధాన భాగంగా ఉన్న ఇండియా కూటమి విజయం సాధించలేనప్పటికీ.. ఊహించని దాని కన్నా బలపడింది. అయినప్పటికీ ఈవీఎంలపై విమర్శలు ప్రతిపక్షం తరుపు నుంచి ఆగలేదు. ఈవీఎంలను ప్రవేశపెట్టిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ వ్యవస్థపై ఇంకా అనుమానాలు వ్యక్తం చేయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఎప్పటిలానే ఎన్నికలు ముగియగానే ఈవీఎంలపై విమర్శలు, విశ్లేషణలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఈవీఎంలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ రోజు లెక్కించిన ఓట్లకు మధ్య అంతరం ఉందని కొన్ని వార్తా సంస్థలు కథనాలు రాశాయి. మొత్తం 542 నియోజకవర్గాల్లో 538 నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని తెలిపాయి.

ఈవీఎంలపై కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో పరిశోధనాత్మక కథనాలు ప్రచురితమవవడం, ఆ తర్వాత మస్క్ వ్యాఖ్యలు చేయడం మరింత గందరగోళానికి తావిచ్చాయి. ఇది చాలదన్నట్టు ఈవీఎంలకు సంబంధించిన ఓ కేసులో మంగేశ్ పాండిల్కర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాయువ్య ముంబై లోక్‌సభ స్థానంలో ఈ ఎన్నికల్లో శివసేన షిండే వర్గం అభ్యర్థి రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలిచారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన అమోల్ గజానన్‌ కీర్తికర్‌పై స్వల్ప మెజార్టీతో వైకర్ గెలిచిన దగ్గరి నుంచి.. ఆ పార్టీలో నేతలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేయడం మొదలుపెట్టారు.

ఫోన్ ద్వారా ఈవీఎం ఓపెన్ చేశారని ఆరోపణలు..
నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన షిండే వర్గం కన్నా శివసేన ఉద్ధవ్ వర్గమే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా వారు ఈవీఎంల విశ్వసనీయత, భద్రతపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మంగేశ్ పాండిల్కర్ గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో ఫోన్‌ను ఉపయోగించి ఓటీపీ జనరేట్ చేసి ఈవీఎంను తెరిచారన్నది శివసేన ఉద్ధవ్ వర్గం ఉపయోగం. ఈ ఫోన్‌ను ఎంపీ బంధువులు ఇంకా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఉద్ధవ్ వర్గం నేతలు. కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ ఉపయోగించారన్నదానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఫోన్ ద్వారా ఈవీఎంలు తెరిచే అవకాశమే ఉంటే.. రవీంద్ర వైకర్ 48 ఓట్ల మెజార్టీతో ఎందుకు ఆగిపోతారని, భారీ మెజార్టీ సాధించేలా ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఉండేవారు కదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈవీఎంను తెరిచేందుకు ఓటీపీని జనరేట్ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. డేటా ఎంట్రీకి తప్ప అసలు ఈవీఎంలను తెరిచేందుకు ఓటీపీ అవసరమే లేదని చెప్పింది. గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంపై తప్పుడు కథనం ప్రచురించిన పత్రికకు పరువు నష్టం నోటీసు పంపామని తెలిపింది.

ఇంటర్నెట్ లేకుండా ఈవీఎం హ్యాకింగ్ అసాధ్యం..
మస్క్ ట్వీట్, మహారాష్ట్ర ఘటనపై కేంద్రం స్పందించింది. హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈవీఎంలకు ఇతర ఏ పరికరాలతో అనుసంధానం ఉండదని, విద్యుత్ సరఫరాతో పని లేకుండా బ్యాటరీ ఆధారంగా పని చేస్తాయని, కనెక్టివిటీ, బ్లూ టూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీ ప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. పేపర్ బ్యాలెట్లతో పోలిస్తే ఇది విశ్వసనీయమైన ఓటింగ్ పద్ధతని స్పష్టం చేశారు. అవసరమైతే మస్క్‌కు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయవచ్చని మస్క్ కు కౌంటర్..
సాధారణ కంప్యూటర్లు వాడి, ఇంటర్నెట్‌కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను ఉపయోగించే అమెరికా, ఇతర దేశాలకు మస్క్ వ్యాఖ్యలను అన్వయించవచ్చు కానీ భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు కాదని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యల తర్వాత మస్క్ దేన్నయినా హ్యాక్ చేయవచ్చు అంటూ మరో ట్వీట్ చేశారు. అయితే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయవచ్చని ఎవరైనా చెప్పొచ్చంటూ రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ వేశారు. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్ వంటి వాటిని హ్యాక్ చేయలేమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న రాహుల్ గాంధీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను మరో కోణంలో చూడాలని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. టెస్లా కార్లను భారత్‌లో అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకం తగ్గించాలని మస్క్ చేస్తున్న విజ్ఞప్తిని భారత్ పట్టించుకోవడం లేదని, అలాగే చైనాలో తయారుచేసి భారత్‌లో అమ్ముతామన్న ప్రతిపాదననూ తోసిపుచ్చిందని, భారత్‌లో తయారీ యూనిట్ పెట్టాల్సిందేనని మస్క్‌కు షరతు విధించిందని.. ప్రపంచాన్ని శాసిస్తున్నట్టుగా తనకు తాను భావించుకునే మస్క్.. భారత్ నిబంధనలపై ఆగ్రహంతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు అదను చూసి ఈవీఎంలపై ఆరోపణలు చేశారని విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు మస్క్ ఉచ్చులో పడరాదని సూచిస్తున్నారు. అలాగే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే, బీజేపీపై చేసే ఆరోపణలు నిజమైతే… 370 స్థానాలు సాధించాలన్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు ఎన్నికల ప్రక్రియ కోసం 60లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకున్నారని, వాటిలో 40లక్షలే ఉపయోగించారని, మిగిలిన 20లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని కొన్ని పార్టీలు, కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కేంద్రం కానీ, ఈసీగానీ దీనిపై స్పందించడం లేదు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈవీఎంలపై రచ్చ ఎక్కువగా ఉందనేది నిజం.

Also Read : ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? భారత్‌లో భారీ దుమారం రేపిన ఎలాన్ మస్క్ ట్వీట్

ట్రెండింగ్ వార్తలు