Aryan Khan Drugs Case : ఆర్యన్‌ఖాన్  డ్రగ్స్ కేసు-షారుక్‌ తో రహస్య ఒప్పందం ?

ముంబై క్రూయిజ్‌షిప్‌ డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్‌ చాటింగ్‌ లిస్ట్ బయటకు తీసి.. లింకులు ఉన్న ప్రతీ ఒక్కరిని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ.

Aryan Khan Drugs Case  : ముంబై క్రూయిజ్‌షిప్‌ డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్‌ చాటింగ్‌ లిస్ట్ బయటకు తీసి.. లింకులు ఉన్న ప్రతీ ఒక్కరిని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ. ఐతే ఇప్పుడు ఈ కేసు స్వతంత్ర సాక్షి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ఖాన్‌ను విడిపించేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారని అంటున్నారు. ఇంతకీ ఎవరు.. ఎవరి మీద ఆరోపణలు చేశారు. దీనిపై ఎన్సీబీ ఎలా రియాక్ట్ అయింది.. అసలేం జరిగింది..

ముంబై షిప్‌ డ్రగ్స్ కేసులో సినిమాను మించి ట్విస్టులు కనిపిస్తున్నాయ్. ఈ కేసులో స్వతంత్ర సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ సంచలన ఆరోపణలు చేశాడు. ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారూఖ్‌ఖాన్‌తో ర‌హ‌స్య ఒప్పందం కుదిరింద‌ని బాంబ్‌ పేల్చాడు. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే, ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావి.. షారుఖ్‌ను 25 కోట్లు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు చేశాడు. ఇందులో ఇప్పటికే 50 ల‌క్షలు తీసుకున్నారని కూడా చెప్పాడు. విషయం ఎవరితోనైనా చెప్తే ఇరుకునపడతావని తనను బెదిరించారని సెయిల్ అంటున్నాడు. తెల్లకాగితంపై బలవంతంగా సంతకం కూడా చేయించుకున్నారని ఆరోపించాడు.

క్రూయిజ్ షిప్ డ్రగ్స్‌ కేసులో 9మందిని ఎన్‌సీబీ సాక్షులుగా చేర్చింది. ఇందులో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ కేపీ గోసావి కూడా ఒక‌రు. ప్రభాక‌ర్ సెయిల్ అత‌నికి బాడీగార్డ్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అత‌న్ని కూడా ఎన్సీబీ ప్రశ్నించింది. డబ్బులు డిమాండ్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన సెయిల్‌.. ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నుంచి ముప్పు ఉంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాడు. దీంతో కేసు ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. ఇక దీనికితోడు డిటెక్టివ్‌ గోసావి కూడా అజ్ఞాతంలో ఉన్నారు.

నిజానికి ఈ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మొదటి నుంచి సమీర్‌ పేరు మారుమోగింది. తగ్గేదే లే అన్నట్లు విచారణలో దూసుకుపోయారు. నిజాయితీపరుడిగా పేరు ఉన్న అతనిపై.. ఇలాంటి ఆరోపణలు రావడం చర్చకు దారి తీస్తోంది. ఇక సెయిల్‌ చేస్తున్న ఆరోపణలను ఎన్సీబీ ఖండించింది. ప్రభాకర్‌ సెయిల్‌ ఈ కేసులో సాక్షిగా ఉన్నాడని.. ఏమైనా ఉంటే కోర్టు ముందు చెప్పుకోవాలి తప్ప.. ఇలా సోషల్ మీడియాలో కాదని ఎన్సీబీ అంటోంది. సంస్థ పరువుకు భంగం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. డబ్బులు తీసుకున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ.. తమ విచారణ కొనసాగిస్త్తోంది.

Also Read : Chandrababu’s Delhi Tour: నేడు ఢిల్లీ‏కి చంద్రబాబు.. వైసీపీ దాడులపై ఫిర్యాదు

ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహారం.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో రాజకీయంగానూ ఈ వ్యవహారం సెగలు రేపుతోంది. శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వేల కోట్ల దందాను వదిలేసి.. చిన్నమొత్తంలో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని టార్గెట్‌ చేయడం ఏంటని ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆర్యన్‌తో డిటెక్టివ్‌ గోసావి మాట్లాడుతున్న ఓ వీడియోను షేర్‌ చేసిన శివసేన నేతలు.. ఇప్పుడు ఈ ఆరోపణలు తర్వాత ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు