దారుణాతి దారుణం.. బాలిక తల నరికి పారిపోయిన కిరాతకుడు

పెళ్లి ఆగిపోయిందన్న అక్కసుతో ఓ ఉన్మాది రాక్షసుడిలా మారిపోయాడు. పదో తరగతి బాలికను పాశవికంగా పొట్టనపెట్టుకోవడమే కాకుండా..

Karnataka Case: కాలేజీ క్యాంపస్‌లో యువతిని కత్తితో దారుణంగా నరికి హత్య చేసిన ఘటన మరవక ముందే కర్ణాటకలో మరో కిరాతం జరిగింది. పెళ్లి ఆగిపోయిందన్న అక్కసుతో ఓ ఉన్మాది రాక్షసుడిలా మారిపోయి బాలిక తల నరికాడు. పదో తరగతి బాలికను పాశవికంగా పొట్టనపెట్టుకోవడమే కాకుండా బాలిక తల తీసుకుని పారిపోయాడు. కొడగు జిల్లా మడికేరి తాలూకాలోని సూర్లబ్బి గ్రామంలో గురువారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 32 ఏళ్ల ఓంకారప్ప అనే యువకుడు 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవాలకున్నాడు. ఇందులో భాగంగా ఎంగేజ్‌మెంట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. మైనర్ బాలికను ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నాడనే విషయం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఎవరో సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఎంగేజ్‌మెంట్‌ను అడ్డుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లిచేస్తే పోస్కో, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత.. వారు బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేయడానికి అంగీకరించారు. దీంతో నిశ్చితార్థం వేడుక రద్దయింది. కొన్ని గంటల తర్వాత ఓంకారప్ప.. బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రిని తన్నడంతో పాటు తల్లిపై పదునైన కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత బాలికను ఇంటి నుంచి 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి తల నరికి చంపి పారిపోయాడు. పరారైన నిందితుడిని అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కొడగు ఎస్పీ రామరాజన్ కె.. పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు ఓంకారప్పపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 307 (హత్య ప్రయత్నం), 302 (హత్య), లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిన్న ప్రకటించిన కర్ణాటక టెన్త్ ఫలితాల్లో మృతురాలు పాసైంది. పదో తరగతి ఫలితాలు వచ్చిన రోజే ఆమె హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు