China`s population policy: ముగ్గురు పిల్లలను కనడానికి చైనా అనుమతి

ఇద్దరు కూడా వద్దు ఒక్కరే ముద్దు అంటూ ఒకప్పుడు చెప్పిన చైనా.. ఇప్పుడు ముగ్గుర్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. చైనాలో సంతానంపై పరిమితులను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం.

Big change in population policy: ఇద్దరు కూడా వద్దు ఒక్కరే ముద్దు అంటూ ఒకప్పుడు చెప్పిన చైనా.. ఇప్పుడు ముగ్గుర్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. చైనాలో సంతానంపై పరిమితులను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. జననాల రేటు భారీగా తగ్గడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఇకపై ప్రజలు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చని అనుమతి ఇచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పార్టీ పొలిట్‌బ్యురో మీటింగ్‌లో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు.

జనాభా రేటు బాగా తగ్గిపోవడంతో జనాభా లెక్కలను చూసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వన్‌ చైల్డ్ పాలసీని అమలు చేసిన డ్రాగన్‌ కంట్రీ.. ఒకరు వద్దు.. ముగ్గురైనా పర్లేదు అంటోంది. అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ముగ్గురు పిల్లలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దశాబ్దాలనాటి వన్‌ చైల్డ్‌ పాలసీని 2016లోనే చైనా రద్దు చేసి.. టూ చైల్డ్ పాలసీని అమలులోకి తెచ్చినా.. జనం నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చైనాలోని నగరాలు, పట్టణాల్లో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉండడంతో.. ఒక్క బిడ్డనే పెంచలేమనేది మెజారిటీ కుటుంబాల ఆలోచన. అందుకే రెండో బిడ్డనూ కనడానికి సిద్ధపడడం లేదు. దీంతో చైనా ప్రభుత్వం ఆశించినంతగా జనాభా వృద్ధి చెందట్లేదు. గతేడాది కోటి 20 లక్షల మంది పిల్లలే దేశంలో జన్మించారు. 1961 నుంచి చూస్తే ఇదే అత్యల్పం.

పరిస్థితి ఇలానే ఉంటే దేశ రక్షణకు అవసరమైన సైనికులూ భవిష్యత్తులో దొరకరంటూ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో దద్దుబాటు చర్యల్లో భాగంగా అత్యధిక ఆదాయం ఉన్న కుటుంబాలు ముగ్గురు పిల్లలు వరకు కనాలని సూచించింది. ఈ నెల ప్రారంభంలో వెల్లడైన జనాభా లెక్కల ప్రకారం చైనాలో గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 0.53 శాతం. 2000-2010 మధ్య ఇదే వృద్ధి రేటు 0.57 శాతం ఉంది.

2010 జనాభా లెక్కలతో పోలిస్తే చైనాలో 16 నుంచి 59 సంవత్సరాల వయసు జనాభా 4 కోట్లు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండే చైనాలో సడలింపులు ఎవరూ ఊహించనిదే. చైనాలో 2019 జనాభా లెక్కల ప్రకారం.. మొత్తం 139.77కోట్ల మంది ఉన్నారు. ఇదే సమయంలో 2019లో ఇండియాలో 136.64కోట్ల జనాభా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు