IPL 2024 : రిలీ రోసో హాఫ్ సెంచరీ వృథా.. బెంగళూరు చేతిలో పంజాబ్ ఘోర పరాజయం

IPL 2024 : PBKS vs RCB : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IPL 2024 : PBKS vs RCB : ఐపీఎల్ 2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఛేదనలో తడబడింది. ఆది నుంచి వరుసుగా వికెట్లను కోల్పోతూ పంజాబ్ భారీ ఓటమిని చవిచూసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఛేదనలో పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది.

పంజాబ్ ఆటగాళ్లలో రిలీ రోసోవ్ (61; 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ వృథా అయింది. శశాంక్ సింగ్ (37), జానీ బెయిర్ స్టో (27), సామ్ కరన్ (22) రాణించగా, మిగతా ఆటగాళ్లలో అశుతోష్ శర్మ (8), జితేష్ శర్మ (5), రాహుల్ చాహర్ (5), ఆర్ష్‌దీప్ సింగ్ (4), ప్రభుసిమ్రాన్ సింగ్ (6) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ షిరాజ్ 3 వికెట్లు, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

హాఫ్ సెంచరీతో విరాట్ వీరబాదుడు.. :
తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 242 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు ఓపెనర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (92; 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్) విజృంభించి సెంచరీకి చేరువలో నిష్ర్కమించాడు.

రజత్ పాటిదార్ (55), కామెరాన్ గ్రీన్ (46) పరుగులతో రాణించగా, దినేష్ కార్తీక్ 18, విల్ జాక్స్ 12 పరుగులు చేశారు. డు ప్లెసిస్ (9), స్వప్పిల్ సింగ్ (1) పేలవ ప్రదర్శనతో పెవిలియన్ బాటపట్టారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, విధ్వత్ కావేరప్ప 2 వికెట్లు తీసుకోగా, ఆర్ష్ దీప్ సింగ్, సామ్ కరన్ తలో వికెట్ తీసుకున్నారు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ (92)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాప్ 7లో బెంగళూరు :
పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 7 ఓడి 10 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 ఓడి 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది.

Read Also : T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు శ్రీలంక జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు