Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు.. కానీ కండీషన్స్ అప్లై..
తొక్కిసలాట ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Chinnaswamy Stadium will host cricket matchs for the first time since the RCB stampede
Chinnaswamy Stadium : జూన్ 4వ తేదీన బెంగళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలిచిన మరుసటి రోజు ఆర్‌సీబీ నిర్వహించిన విక్టరీ పరేడ్ విషాదాంతంగా మారింది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50కి పైగా మంది గాయపడ్డాడు. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో మ్యాచ్‌లు నిర్వహించవద్దని, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చేలా స్టేడియం సామర్థ్యం లేదని పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో చిన్నస్వామి వేదికగా జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు సైతం మరో వేదికకు తరలిపోయాయి. అయితే.. తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చిన్నస్వామిలో మళ్లీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
సెప్టెంబర్ 26 నుంచి కె తిమ్మప్పయ్య మెమోరియల్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలోని ఆరు మ్యాచ్‌లు చిన్నస్వామి వేదికగా జరగనున్నాయి. ఇందులో సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా ఉండడం గమనార్హం.
అయితే చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను అభిమానులు ప్రత్యక్షంగా చూసేందుకు మాత్రం అనుమతి లేదు. అభిమానుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
16 జట్లు ఈ టోర్నీలో పాల్గొనున్నాయి. ఇందులో ముంబై, బరోడా, విదర్భ వంటి తదితర జట్లు ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్, హనుమ విహారి, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడుతుండడంతో ఫ్యాన్స్ దృష్టి ఈ టోర్నీ పై పడింది