Heatwave Alert : భానుడి ఎఫెక్ట్.. మూడు రోజులు బయటికి రావొద్దు..! ఆ ప్రాంతాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
Heatwave Alert : మార్చి మొదటి వారంలోనే వేసవి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచే మొదలవుతున్న సూర్య పత్రాపం మధ్యాహ్నానికి హడలెత్తిస్తోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోత కూడా మొదలైంది.
Heatwave Alert
- నిప్పులు చెరుగుతున్న సూర్యుడు
- మార్చి తొలివారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- రాబోయే మూడ్రోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
Heatwave Alert : ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఉదయం 8గంటలు దాటితే చాలు కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. ఉదయం 10గంటల తరువాత రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, వచ్చే మూడు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
మార్చి మొదటి వారంలోనే వేసవి తీవ్రత కనిపిస్తోంది. ఉదయం నుంచే మొదలవుతున్న సూర్య ప్రతాపం మధ్యాహ్నానికి హడలెత్తిస్తోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోత కూడా మొదలైంది. ఇప్పటికే ఎండల మంట తీవ్రంగా ఉండగా.. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని, ప్రజలు అప్రత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వచ్చే మూడు రోజుల్లో ఎండ తీవ్రతకు సంబంధించి ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో సాధారణం కంటే రెండుమూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే.. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 37 నుంచి 39డిగ్రీల వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో మంగపేట మండలం మల్లూరులో అత్యధికంగా 39 డిగ్రీల చొప్పున గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎండల తీవ్రత, ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఇదే తరహాలో కొనసాగితే వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
