Matthew Breetzke ODI World record : వరల్డ్ రికార్డు సాధించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే.. వన్డే క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
దక్షిణాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో వరల్డ్ రికార్డ్ సాధించాడు (Matthew Breetzke ODI World record).

South Africa batter Matthew breetzke sets ODI World record
Matthew Breetzke ODI World record : దక్షిణాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే(Matthew Breetzke) వన్డేల్లో తనదైన ముద్రను వేస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అరంగ్రేటం నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ యాభైకి పైగా స్కోర్లను సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు (Matthew Breetzke ODI World record).
గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 85 పరుగులు సాధించడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. అరంగ్రేటం నుంచి వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50 ఫ్లస్ స్కోర్లు చేసిన టీమ్ఇండియా ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉన్న రికార్డును మాథ్యూ బ్రీట్జ్కే అధిగమించాడు.
Ross Taylor : రాస్ టేలర్ సంచలన నిర్ణయం.. రిటైర్‌మెంట్ వెనక్కి.. న్యూజిలాండ్‌కు మాత్రం ఆడను..
2025లో లాహోర్‌లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా మాథ్యూ బ్రీట్జ్కే 50 ఓవర్ల ఫార్మాట్‌లో అరంగ్రేటం చేశాడు. తన తొలి వన్డేలోనే 150 పరుగులు సాధించి.. అరంగ్రేట మ్యాచ్‌లోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఆ తరువాత పాకిస్థాన్ పై 83 పరుగులు చేశాడు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 57 పరుగులు, 88 పరుగులు చేశాడు. తాజాగా లార్డ్స్‌లో 85 పరుగులు సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. సఫారీ బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే (85; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (58; 62 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలు బాదారు. ఐడెన్ మార్‌క్రమ్ (49), డెవాల్డ్ బ్రెవిస్ (42) లు రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టగా.. జాకబ్ బెథెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులకే పరిమితమైంది. దీంతో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జోరూట్ (61; 72 బంతుల్లో 8 ఫోర్లు), జోస్ బట్లర్ (61; 51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జాకబ్ బెథెల్ (58; 40 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్ మూడు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్ బాష్, సెనూరన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి లు తలా ఓ వికెట్ సాధించారు.