Ishan Kishan : ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు ఇషాన్ కిషన్ సోదరి మృతి.. బాధను దిగమింగి.. సూపర్ ఇన్నింగ్స్..
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్ (Ishan Kishan) కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
Ishan Kishan lost his cousin one day before T20 World Cup 2026 final
- ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు కజిన్ సిస్టర్ మృతి
- బాధను దిగమించుకుని అద్భుత ఇన్నింగ్స్
- తన ఇన్నింగ్స్‌ను సోదరికి అంకితం ఇచ్చిన ఇషాన్ కిషన్
Ishan Kishan : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు రోజు అంటే శనివారం (మార్చి 7) ఇషాన్ కిషన్ సోదరి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఈ విషయాన్ని ఫైనల్ మ్యాచ్ అనంతరం అతడే స్వయంగా వెల్లడించాడు. తన ఇన్నింగ్స్‌ను ఆమెకు అంకితం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
‘వాస్తవానికి నేను ఈ విషయం చెప్పాలని అనుకోలేదు. కానీ నిన్న (శనివారం) కారు ప్రమాదంలో నా కజిన్ సోదరిని కోల్పోయాను. ప్రాక్టీస్ సెషన్లో నాకు ఈ విషయం తెలిసింది. నేను ఎప్పుడూ రాణించాలని ఆమె కోరుకునేది. ఆమె కోసం పరుగులు చేయాలని అనుకున్నాను. అందుకనే ఫైనల్ మ్యాచ్‌లో అర్థశతకం సాధించిన తరువాత పైకి చూశాను. నా ఇన్నింగ్స్ ఆమెకు అంకితం చేస్తున్నాను. ‘అని ఇషాన్ కిషన్ అన్నాడు.
మార్చి 7న పశ్చిమ బెంగాల్‌లోని 27వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇషాన్ కిషన్ కజిన్ సోదరి వైష్ణవి సింగ్, ఆమె భర్త మరణించారు. ఈ ప్రమాదం నుంచి వారిద్దరి పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. తన కుటుంబంలో ఈ విషాదం నెలకొన్నప్పటికి కూడా ఫైనల్ మ్యాచ్ ఆడాలని ఇషాన్ కిషన్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కష్టసమయంలో తనకు హార్దిక్ పాండ్యా ఇచ్చిన మద్దతు మరువలేనిదని అన్నాడు.
‘విషయం తెలిసిన తరువాత నా మనసు బాగా లేదు. నేను హార్దిక్ తో మాట్లాడాను. అది అంత సులభం కాదని అతను చెప్పాడు. అయితే.. ఇది జట్టు క్రీడ అని అతడు నాకు గుర్తు చేశాడు. ఇలాంటి సమయంలో జట్టు ప్రయోజనం కోసం ఒకరికి మరొకరం అండగా నిలవాలని సూచించాడు. ఇదే నాలో ఫైనల్ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనే తపన పెంచింది.’ అని ఇషాన్ అన్నాడు.
ఫైనల మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో 54 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్‌తో కలిసి 48 బంతుల్లోనే 105 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ అత్యధిక పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. అతడు 35.22 సగటు 193.39 స్ట్రైక్‌రేటుతో 317 పరుగులు సాధించాడు.
