Ross Taylor : రాస్ టేలర్ సంచలన నిర్ణయం.. రిటైర్‌మెంట్ వెనక్కి.. న్యూజిలాండ్‌కు మాత్రం ఆడను..
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ తన రిటైర్‌మెంట్ (Ross Taylor) నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

New Zealand Great Ross Taylor comes out of retirement
Ross Taylor : న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2021 డిసెంబర్ 30న వీడ్కోలు పలికిన టేలర్ (Ross Taylor) తాజాగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. అయితే.. ఈ సారి అతడు న్యూజిలాండ్ తరుపున ఆడడం లేదు. సయోవా అనే పసికూన జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టేలర్ వెల్లడించాడు
‘రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. సయోటా జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా. ఇదొక గొప్ప పునరాగమనంగా మారుతుందని ఆశిస్తున్నాను. నా వారసత్వం, సంస్కృతి తరుపున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. జట్టుతో కలిసి నా అనుభవాలను పంచుకుంటా.’ అని 41 ఏళ్ల టేలర్ శుక్రవారం తెలిపాడు.
వెల్లింగ్‌టన్‌కు చెందిన రాస్ టేలర్ 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. కివీస్ తరుపున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 44.7 సగటుతో 7683 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక వన్డేల్లో 47.5 సగటుతో 8607 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు, 51 అర్థశతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 26.1 సగటుతో 1909 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్థశతకాలు ఉన్నాయి.
Ross Taylor will be representing Samoa in the Asia-Pacific T20 WC Qualifiers. pic.twitter.com/MMaLm1XA6g
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2025
టేలర్ 2008 నుంచి 2014 వరకు ఐపీఎల్ ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో 25.4 సగటుతో 1017 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి.
సయోవా తరుపున ఎలాగంటే..?
రాస్ టేలర్ తల్లి సయోవా మూలాలు కలిగి ఉంది. ఆమె వారసత్వంతోనే టేలర్ కు సమోవా పాస్‌పోర్టు కూడా వచ్చింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అతడు మరో జట్టు తరుపున ఆడేందుకు నిరీక్షించాల్సిన మూడేళ్ల సమయం పూర్తైంది.
2026లో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సయోవా అర్హత సాధించాలంటే క్వాలిఫయర్స్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్ తరుపున క్వాలిఫయర్‌లో సమోవా అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.